న్యూయార్క్: టాప్ సీడ్ హోదాకు తగ్గ ప్రదర్శన కనబరిచిన జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జ్వెరెవ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/2), 5–7, 6–2తో విజయం సాధించాడు. జ్వెరెవ్‌కు 55 లక్షల డాలర్లు (రూ. 52 కోట్ల 76 లక్షలు), షెల్టన్‌కు 28 లక్షల డాలర్లు (రూ. 26 కోట్ల 86 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌కు గట్టిపోటీనే ఎదురైనా కీలకదశలో పాయింట్లు నెగ్గి పైచేయి సాధించాడు. 2020లో యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన 29 ఏళ్ల జ్వెరెవ్ ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి జ్వెరెవ్ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. బోరిస్ బెకర్ (1989లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్) తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రెండో జర్మన్ ప్లేయర్‌గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు.


