వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు నేడు భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఒకవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టి20 జట్టు అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడుతుండగా... మరోవైపు ఈ నెలాఖరున ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ బుధవారం జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆ తర్వాత నేరుగా... జపాన్ వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లనుంది.
కాగా... ఈ నెల 27 నుంచి వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 27న తిరువనంతపురం వేదికగా తొలి వన్డే, 30న గువాహటిలో రెండో వన్డే, అక్టోబర్ 3న చండీగఢ్‌లో మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొన్న జట్టే విండీస్‌తో టి20 సిరీస్‌లో పాల్గొననుంది. అయితే వన్డే సిరీస్ కోసం మాత్రం సెలెక్టర్లు ఈ రోజు జట్టును ఎంపిక చేయనున్నారు.
‘రో–కో’ రీ ఎంట్రీ...
టెస్టు, టి20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానుండగా... గాయం నుంచి కోలుకున్న పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక తథ్యమే. నితీశ్ కుమార్ రెడ్డి ఆసియా క్రీడల్లో పాల్గొంటుండగా... అదనపు పేస్ ఆల్‌రౌండర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
వెంకటేశ్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్ రూపంలో రెగ్యులర్ వన్డే వికెట్ కీపర్ అందుబాటులో ఉండగా... అదనపు కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కుతుందా చూడాలి. చాన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈసారి కూడా అతడిని ఎంపిక చేయకపోతే... రిజర్వ్ కీపర్‌గా ధ్రువ్ జురేల్‌కు అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే పంత్ ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారథ్యం వహించాల్సి ఉంటుంది.
షమీకి చివరి చాన్స్ వచ్చేనా!
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లితో టాపార్డర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకపోగా... టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో నాలుగో స్థానంలో ఖాళీని రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్‌లలో ఒకరితో నింపే అవకాశాలున్నాయి. యశస్వి జైస్వాల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేయనుండగా... సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కొనసాగిస్తారా లేక మానవ్ సుతార్‌కు అవకాశం ఇస్తారా అనేది కీలకం. విప్రాజ్ నిగమ్, జీషన్ అన్సారీ రూపంలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే వన్డే ప్రపంచకప్ టోరీ్నకి మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ప్రయోగాల జోలికి వెళ్లకుండా... పాత జట్టుకే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో భారీ మద్దతు కూడగట్టుకున్న మొహమ్మద్ షమీకి ఈసారైనా జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి. దేశవాళీల్లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన బౌలింగ్‌తో సత్తాచాటుతున్న షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్ భారీగా వినిపిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. బుమ్రా ఆసియా క్రీడల బరిలో ఉన్న నేపథ్యంలో సిరాజ్‌కు వన్డే పిలుపు వచి్చనా ఆశ్చర్యపోనక్కరలేదు.


