శ్రీలంక జావెలిన్ త్రోయర్ రమేశ్ పతిరాగెకు షాక్
కొలంబో: శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ రమేశ్ పతిరాగెకు ఆసియా క్రీడలకు ముందు అనూహ్య పరిణామం ఎదురైంది. విమాన ప్రయాణంలో అతడి జావెలిన్‌లు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 13న బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ అల్టీమేట్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఇది జరగగా... 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ వెంటనే ఫిర్యాదు చేశాడు. ‘నా ఐదు జావెలిన్‌లు విమాన ప్రయాణంలో దెబ్బతిన్నాయి. ఆసియా క్రీడలతో పాటు 2028 ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో వీటిని వినియోగించాలని అనుకున్నా’ అని పతిరాగె అన్నాడు.
ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న పతిరాగె మూడుసార్లు 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు డైమండ్ లీగ్‌లో పతిరాగె... భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ఓడించడం విశేషం. ఇటీవల బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌తో సహా... ఈ శ్రీలంక అథ్లెట్ తాను పాల్గొన్న చివరి 12 అంతర్జాతీయ పోటీల్లో 11 టైటిల్స్ సాధించాడు. జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడల్లోనూ అతడే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గాయం కారణంగా నీరజ్ చోప్రా ఏషియన్ గేమ్స్ నుంచి తప్పుకున్నాడు.


