మూడు నెలల కిందట ఇదే ఏడాది 2026 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్లావియో కొబొల్లీని ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు అలెగ్జాండర్ జ్వెరెవ్. కానీ అతడు తేల్చుకోవాల్సిన పాత లెక్క ఒకటుంది. అదీ...
ఆరేళ్ల కింద 2020 నాటి ఓ పాత కథ ఇది...
అది 2020 నాటి యూఎస్ ఓపెన్. ఆరోజు 23 ఏళ్ల జ్వెరెవ్‌కి ప్రత్యర్థిగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ ఆడుతున్నాడు. జ్వెరెవ్ మొదటి రెండు సెట్లూ గెలిచాడు. దాదాపుగా చేతికి అందేంత దగ్గర్లో ఒక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ!! ఇక కావాల్సింది కేవలం రెండంటే రెండు పాయింట్లే!! కానీ... జ్వెరెవ్ ఆ తర్వాత మూడు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు.
మళ్లీ ఆరేళ్ల తర్వాత... తేదీ 2026 సెప్టెంబర్ 13... న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియం... పాతికవేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపాయిన స్టేడియం. ఒకవైపు అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్. ఆట జరుగుతున్నది న్యూయార్క్‌లోనే కావడంతో తమ దేశపు ఆటగాడే గెలవాలన్న కోరిక చాలామందిలో ఉండటం మామూలే. అందుకే... ‘దాదాపు 99.9% మంది ప్రేక్షకులు బెన్ షెల్టన్ గెలవాలని కోరుకుంటున్నారేమో’ అంటూ జ్వెరెవ్ సరదాగా ఓ కామెంట్ కూడా చేశాడు. చివరికి... తన ప్రత్యర్థి బెన్ షెల్టన్‌ను జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. ఇప్పుడు జ్వెరెవ్ చేతిలో ట్రోఫీ! ఆరేళ్ల కిందట అతడు రన్నరప్.
కానీ ఇప్పుడు చాంపియన్!!
చుట్టూ ఎందరో ఫ్యాన్స్ ఉండవచ్చు. కానీ జ్వెరెవ్ మనసులో ఒకరున్నారు. ఒకరే ఉన్నారు. ఆ ఒకే ఒక వ్యక్తి ఆమె తల్లి ఇరీనా! అతడి మనసులో ఆ తల్లి అన్న మాటలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటే జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసప్పటి కాలానికి వెళ్లాలి.
జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి కథ ఇది...
డాక్టర్ చెప్పాడు... ‘‘ఈ నాలుగేళ్ల చిన్నారికి టైప్–1 డయాబెటిస్’’ అని! అప్పుడు అతడి కుటుంబ సభ్యులు అడిగారు ‘‘ఇక ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది?’’ అని. ‘‘స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకుంటే అది కష్టం కావచ్చు’’ అన్నాడు డాక్టర్. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడంటే... జ్వెరెవ్ తల్లి ఇరీనా కూడా మాజీ టెన్నిస్ ప్లేయరే. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది పేరెంట్స్ సాధారణంగా ఏమంటారు? ‘‘సరే.... ముందు హెల్త్. ఆ తర్వాతే స్పోర్ట్స్...’’ అని. కానీ జ్వెరెవ్ తల్లి... ఇరీనా అలా అనుకోలేదు. ఆమె తన నాలుగేళ్ల కొడుకును చూసి...
‘‘నా కొడుకు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది టైప్–1 డయాబెటిస్ నిర్ణయించదు. అతడు టెన్నిస్ ప్లేయర్ కావాలంటే టెన్నిస్ ప్లేయర్. లేదా ఇంకేదైనా... మరేదైనా కావాలంటే అదీ’’.
టైప్–1 డయాబెటిస్ కొనసాగింది... ప్రతిరోజూ గుచ్చే సూదులూ... రోజూ తాను కళ్లజూసే రక్తపుబొట్లు... రోజు వాడాల్సిన మందులతో!
కానీ జీవితమూ కొనసాగింది. అదీ అతడి ఇష్టప్రకారమే...
ప్రాక్టీస్... ఫిట్‌నెస్... మ్యాచులు. ప్రయాణాలూ... విజయాలతో! తన చిన్నప్పటి నుంచీ టైప్–1 డయాబెటిస్ కండిషన్‌తోనే.. ఎన్నో కండిషన్ల మధ్యన అతడు జీవిస్తున్నాడు. టెప్–1 డయాబెటిస్ అంటే ఏమిటో, దానితో జీవితమెలా ఉంటుందో చూద్దాం...
టైప్–1 డయాబెటిస్ అంటే...?
పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. చిన్నారుల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు.
ఎందుకు వస్తుందంటే...
టైప్–1 డయాబెటిస్ ఎందుకొస్తుందనే కారణం నిర్దిష్టంగా తెలియదుగానీ... సాధారణంగా పిల్లలకు సోకే వైరస్‌లు, రకరకాల పర్యావరణ అంశాల వంటి చాలా కారణాలతో ఇది రావచ్చన్నది వైద్య నిపుణుల అభిప్రాయం.
గుర్తించడమెలా?
టైప్–1 డయాబెటిస్ లక్షణాలు పిల్లలందరిలోనూ ఒకేలా ఉండకపావచ్చు. ఈ కింది లక్షణాల్లో ఏవైనా కనిపించినప్పుడు పేరెంట్స్ వాటిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అవి...
→ నీళ్లు ఎక్కువగా తాగుతుండటం; పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేసిన పిల్లలూ మళ్లీ్ల పక్క తడపటం మొదలుపెట్టడం ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం
→ వెంటవెంటనే అలసిపాతుండటం, నీరసంగా ఉండటం
→ వారి జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుండటం.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపాతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అదేపనిగా పేరుకుపాయిన అధిక గ్లూకోజ్ వల్ల కీటోన్స్ అనే విష పదార్థాలు రక్తంలో పేరుకుపాతాయి. దాంతో ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు.
→ తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం) ∙శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పిపడిపావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపాయే కండిషన్‌ను ‘కీటో అసిడోసిస్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ఇది.
టైప్–1 డయాబెటిస్ (మేనేజ్‌మెంట్)
పిల్లల్లో టైప్–1 డయాబెటిస్‌ను నాలుగు అంశాల నిర్వహణ ద్వారా సమర్థంగా మేనేజ్ చేయవచ్చు. అవి..
1. ఇన్సులిన్ : ఈ పిల్లల విషయంలో ఇన్సులిన్ ఇవ్వడం రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ. ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్ ద్వారానే జరగాలి. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మం కింది ‘సబ్‌క్యుటేనియస్ పొర’లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్ వంటి ఉపకరణాలు, ఇన్సులిన్ పంప్స్ వంటి ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
2. గ్లూకోజ్ మానిటరింగ్ : పిల్లలకు కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపాదు. వారు తిన్న మోతాదును బట్టి ఎంత ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్’ ఉపయోగపడుతుంది. పిల్లల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గితే గ్లూకోజ్‌గానీ లేదా చక్కెరగానీ తినిపించాలి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే... ఇన్సులిన్ ఇవ్వాలి.
3. ఆహారం : చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. ఈ క్రమంలో ఎక్కువ చక్కెరలూ లేదా తీపి పదార్థాలు లేని మంచి సమతులాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆహారంలో తగిన పాళ్లలో కార్బోహైడ్రేట్స్ సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపాటీన్లు... ఇవి పప్పు, కోడి మాసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్లు...మొ.) ఇవ్వాలి. ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాల కోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్‌నట్ ఇవ్వవచ్చు. వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి.
4. శారీరక శ్రమ : పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా ఇలాంటి పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత ఎక్కువగా అవసరం.
చివరిగా... మరోసారి జ్వెరెవ్ విషయానికి వస్తే...
ఈ సమస్య ఉన్న పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రుల జీవితాల్లో ఆర్థిక పరిమితులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని గమనించినందుకో ఏమోగానీ... ‘జ్వెరెవ్ ఫౌండేషన్’ డయాబెటిస్‌తో జీవిస్తున్న పిల్లలకు... ముఖ్యంగా ఇన్సులిన్ అందని ప్రాంతాల్లో ఉన్నవారికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తోంది. బహుశా... తన నాలుగేళ్ల వయసులో ఎదురైన సమస్యను గుర్తించి ఇప్పుడతడు చాలామంది జీవితాలకు ఉపయోగపడేలా తన ఫౌండేషన్‌ను ఉపయోగిస్తున్నాడని భావించవచ్చు. అతడి ఆర్థికస్థితి అందుకు అనుమతిస్తోంది. కానీ... మన దేశంలోనూ ఇలాంటి చిన్నారుల పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమూ మనందరికీ ఉంది.
రక్తంలోని చక్కెరను ఇంత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరమేమిటంటే?
పిల్లల రక్తంలో చక్కెర మోతాదులు చాలాకాలం పాటు నియంత్రణలో లేకపాతే భవిష్యత్తులో వాళ్లలో చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నియంత్రణలోని లేని చక్కెర వల్ల పిల్లల కిడ్నీలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలకు హాని జరగవచ్చు. నాడీవ్యవస్థపై దుష్ప్రభావాలు పడవచ్చు. ఇవన్నీ బాల్యంలో కనిపించకపావచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.
ఇటీవలి పురోగతి...
టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో వారి రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్ ఆగ్యుమెంటెడ్ పంపులు, క్లోజ్‌డ్ లూప్ సిస్టమ్ వంటి కొన్ని ఆధునిక పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడమూ సాధ్యమవుతోంది. అయితే ఈ పురోగతి ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాలపై చాలా ఆర్థికభారాన్నే మోపుతోంది. భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్ అందేలా చూసేందుకు – ఇన్సులిన్ జీన్ థెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ కంప్లీట్ క్లోజ్‌డ్ లూప్ సిస్టమ్స్ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
డాక్టర్ బి. శిరీష కుసుమ
సీనియర్ పీడియాట్రిక్
ఎండోక్రైనాలజిస్ట్
యాసీన్


