బ్రష్ అయిపోతే.. కొత్తది కొనొద్దు. ఉప్పు, నిమ్మకాయ ఉన్నాయి కదా!
టిఫిన్ కావాలంటే.. యాప్ తెరవొద్దు. వంటింట్లో బియ్యం, పప్పు ఉన్నాయి కదా!
దుస్తులు చిరిగిపోతే... పారేయొద్దు. సూది, దారం ఉన్నాయి కదా!
కూరగాయలు అయిపోతే... కార్ట్ నింపొద్దు. ఉన్న నాలుగింటితోనే
కొత్త రుచిని పుట్టించొచ్చు. షాంపూ... క్రీమ్... మగ్... ఫోన్ ... డెకర్ ఐటమ్స్... ఇలా ప్రతి ‘కావాలి’కీ వెంటనే ‘కొనాలి’ అనకుండా, ‘కాసేపు ఆగండి’ అంటున్నది పాతతరం పొదుపరి పెద్దమనుషులు కాదు, కొత్తదనం కోరుకునే కొత్తతరం!
‘నో బై చాలెంజ్’ అంటూ కొత్తతరం నేడు కొత్త కొనుగోళ్లు, కోరికలు కళ్లెం వేస్తూ... ఆనందానికి ఆహ్వానం పలుకుతోంది.
ప్రపంచం మనకు ప్రతి వస్తువునూ ‘కొత్తది కొనండి’ అని రోజూ మెసేజ్‌లు పంపుతుంటే, కొత్త తరం మాత్రం ‘ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్నది ముందు వాడేస్తా!’ అంటూ కార్ట్‌కు బ్రేక్ వేస్తోంది. చాలామంది ఇప్పుడు ‘నో బై’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అంటే, కొత్త బట్టలు కొనకపోవడం, కొత్త కాస్మెటిక్స్ తెచ్చుకోకపోవడం, ఆఫర్ చూసి కూడా యాప్ మూసేయడం, అవసరం లేని వస్తువుల్ని ‘ఈసారి వద్దు’ అనడం ఇలా కొనుగోళ్లకు గేట్లు మూసేసి, ఉన్నవాటికి రెడ్ కార్పెట్ పరుస్తున్న ఈ కొత్త పిచ్చి ట్రెండ్ పేరు‘నో–బై చాలెంజ్!’ అలా ఈ తరం ‘అసలు బతకడానికి మనకు ఎంత కావాలి?’ అని పరీక్షించుకుంటోంది!
నంబర్లు కూడా చెప్తున్నాయి!
ఇది కేవలం సోషల్ మీడియాలో కనిపించే మరో హ్యాష్‌ట్యాగ్ మాత్రమే కాదని కొన్ని సర్వేలు నిరూపించాయి. 2025లో అమెరికాలో 1,015 మంది పెద్దలపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మంది ‘నో బై చాలెంజ్’లో ఇప్పటికే పాల్గొంటున్నామని చెప్పారు. మరో 44 శాతం మందిలో ‘బై చాలెంజ్’ గురించి అదే విధంగా చెప్పినట్లు వెల్లడైంది. దీని వెనుక ప్రధాన కారణాల్లో 42 శాతం మందికి పొదుపు పెంచుకోవడం, 26 శాతం మందికి అప్పులు తగ్గించుకోవడంలో ఉన్నారు. అయితే ఇదే సర్వే మరో ఆసక్తికరమైన విషయం తెలిపారు. చాలెంజ్‌లో పాల్గొన్న వారిలో 25 శాతం మందికి డబ్బు దాచుకోలేకపోయారు, ఎందుకంటే వారి ఆదాయం అవసరమైన ఖర్చులకే సరిపోతోంది. వీరంతా కూడా ఈ ట్రెండ్‌లో భాగంగానే ఉన్నదానిలో సర్దుకొని జీవితం సాగిస్తున్నారు.
భారత్‌లో బడ్జెట్ పద్మనాభం!
భారతీయ కుటుంబాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక మాట బాగా వినిపిస్తుంది. ‘డబ్బు దాచుకోవాలి. రేపటికి పనికొస్తుంది!’ కానీ అదే పిల్లలు పెరిగి చూసేది మరో లెక్క. పెళ్లి అంటే భారీ ఖర్చు, పండగ అంటే షాపింగ్, ఇంట్లో ఫంక్షన్ అంటే అప్పు చేసైనా ఘనంగా చేయాలి, బంధువుల ముందు తక్కువ కాకూడదు! అంటే మాటల్లో ఉన్న పొదుపు జీవితంలో కనిపించదు. పొదుపు పాఠాలు చెప్పే ఈ పెద్దలందరూ సామాజిక వేడుకల కోసం అవసరానికి మించి ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయరు. అయితే, ఈ సామాజిక ఒత్తిడి మధ్య కొత్త తరం ఇరుక్కుపోవడం లేదు.
ఆర్థిక విషయాలపై చాలా స్పష్టంగా ఉంటున్నారు. ‘నా డబ్బు నిజంగా దేనికి వెళ్లాలి?’ అనే ఆలోచనతో ప్రతి ఖర్చు చేస్తున్నారు. 2025లో జెన్ జీ ఆర్థిక మనసత్వంపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 57 శాతం మంది సాధారణ నెలలో బట్టలు, గాడ్జెట్ల వంటి వాటిపై ఖర్చు చేస్తున్నప్పటికీ, 62 శాతం మంది పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంటే ఖర్చు చేస్తూనే, భవిష్యత్తు కోసం దాచుకోవాలనే ఆలోచన బలంగానే ఉంది. మరో 33 శాతం మంది బడ్జెట్ పెట్టుకున్నా అప్పుడప్పుడూ దాన్ని మించిపోతున్నామని చెప్పారు. కేవలం 15 శాతం మంది మాత్రం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తున్నారు.
అందుకే ఈ చాలెంజ్ కొందరికి ట్రెండ్ కంటే అవసరంగా మారుతోంది.
ఆఫర్ చూసి ఆశ!
అతి సులభంగా మోసం చేయటంలో ఆఫర్స్‌కి ఆస్కార్ ఇవ్వొచ్చు. ‘50% ఆఫర్!’, ‘బై వన్ గెట్ వన్ !’, ‘ఫ్లాట్ 70% తగ్గింపు!’ఈ మాటలు కనిపించగానే మన కళ్లలో మెరుపు, మనసులో ఆశ మేల్కొంటుంది. ‘ఆఫర్ అయిపోబోతోంది’ అని తొందరపెడితే ఆశ ఇంకా పెరుగుతుంది. ‘ఇంత మంచి డీల్ మళ్లీ రాదు’ అనగానే మనసు లెక్కలు మానేసి కొనుగోలుకు ఓటేస్తుంది. ఇక లేచిన వెంటనే లేటుగా... ఇక నేరుగా షాపింగ్ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఈ ఆఫర్.
నిన్నటివరకు అసలు అవసరం లేని వస్తువు కూడా ఇవాళ ఆఫర్‌లో కనిపిస్తే ‘ఈ అవకాశాన్ని వదులుకోవడం మహాపాపం!’ అన్నట్టుగా అనిపిస్తుంది. రూ. రెండు వేల విలువైన వస్తువు, రూ. వెయ్యికే దొరికిందంటే వెయ్యి రూపాయలు ఆదా చేశామనుకుంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమే లేకపోయినా వెయ్యి రుపాయలు వృథా చేశాం. ఇక్కడ మనకు మిగిలింది పొదుపు కాదు, మరో సామాను! చివరికి ఇంటికి వచ్చాకే తెలుస్తుంది. కొన్నది ఆఫర్ కాదు, ఆశ! అందుకే కొన్నిసార్లు కొనకుండా వదిలేసిన ఆఫరే మనకు దొరికిన బెస్ట్ డీల్!
కొత్తదే అడుగుతోందా!
ఫోన్ బాగానే పనిచేస్తోంది. కానీ కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చేసరికి అది ఒక్కసారిగా మీ ఫోన్ పాతకాలపు వస్తువులా రిటైర్మెంట్‌కు దగ్గరైనట్టుగా కనిపిస్తుంది! అల్మరా నిండా బట్టలున్నాయి. అయినా కొత్త డ్రెస్ కనిపిస్తే ‘ఇది మాత్రం లేదు!’ అనిపిస్తుంది. నాలుగు జతల షూస్ సరిపోతున్నా, ఐదో జతకు మాత్రం ‘ఈ రంగు వేరే!’ అనే ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం! మేకప్ బాక్స్ తెరిస్తే చోటే లేదు. అయినా కొత్త షేడ్ కోసం ఖాళీ వెతుకుతాం.
ఇలా మనకు వస్తువుల కొరత కాదు, మనసుకు కొత్తదనం కొరత! కొత్తది కనిపిస్తే కొనాలనిపించడం. ట్రెండ్ మారితే మనమూ మారాలని అనిపించడం ఇవన్నీ కలిసి అవసరానికి ఆకర్షణకి మధ్య గీతను చెరిపేస్తున్నాయి. అందుకే, ఇప్పుడు నోబై చాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు. అయితే, ఇది కూడా మనసు కోరే కొత్తదనం కోరిక తీర్చడానికే అన్నట్లు మరో కొత్త ట్రెండ్ కనిపిస్తే దాని వెంట పరుగులు తీయడం మొదలుపెడుతున్నారు!
రియలా... రీల్ చెబుతోందా?
ఒక ఇన్ ఫ్లుయెన్సర్ ఓ కొత్త బ్యాగ్ చూపించాడు. మనకు అసలు అవసరం లేదు. కానీ అదే బ్యాగ్ ఒక రీల్‌లో మరో రీల్‌లో ఇంకో ‘మస్ట్ హ్యావ్’ వీడియోలో కనిపిస్తే చాలు! నిన్నటివరకు మనకు తెలియని ఆ బ్యాగ్ ఇవాళ లేకపోతే మన జీవితం ఏదో మిస్సవుతున్నట్టుగా అనిపిస్తుంది! ఇదే సోషల్ మీడియా షాపింగ్ మ్యాజిక్! రీల్స్ చూపిస్తాయి. ఇన్ ఫ్లుయెన్సర్లు నచ్చచెప్తారు. ప్రకటనలు గుర్తు చేస్తాయి. ట్రెండ్స్ ఒత్తిడి పెంచుతాయి. చివరికి మన వేలు ‘బై నౌ’ మీద పడుతుంది! భారతీయ ఆన్ లైన్ షాపర్లపై 2026లో ప్రచురితమైన ఒక పరిశోధనలో 413 మంది పాల్గొనగా, వారిలో 280 మంది ఆవేశపూరిత కొనుగోళ్లు తర్వాత పశ్చాత్తాపానికి గురైనట్లు తెలిపారు. ముఖ్యంగా అందరూ ఏదో కొత్తది వాడుతున్నట్టు కనిపిస్తే, మనం మాత్రం వెనకబడిపోయామేమో అన్న భావన మొదలవుతుంది. అందుకే ఇకపై ఏదైనా కొత్తగా కొనేముందు, అది నిజంగా కావాలా? లేక రీల్ చూసిన తర్వాతే కావాలనిపించిందా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది!
ఏం చేయాలి?
నో బైని ఒక్కరోజు ఉత్సాహంతో కాకుండా, చిన్న చిన్న రూల్స్‌తో మొదలుపెడితేనే ఎక్కువ రోజులు నిలుస్తుంది.
ఇలా కార్ట్‌కు బ్రేక్, వాలెట్‌కు ఊరట, మనసుకు క్లారిటీ ఇచ్చే నో బై స్టెప్స్ ఇవే!
కొన్ని రోజులే అనుకోండి!
ఈరోజు నుంచి ఏమీ కొననని ప్రతిజ్ఞ చేస్తే మొదటి రోజే మనసు తిరుగుబాటు చేస్తుంది. అందుకే దీన్ని చిన్న ప్రయోగంలా మొదలు పెట్టాలి. ముందుగా 30 రోజుల చాలెంజ్ పెట్టుకోండి. 30 రోజులు పూర్తయ్యాక ఎలా అనిపించిందో చూసి మరో నెల కొనసాగించవచ్చు.
ఫిక్స్ చేసుకోండి!
అనవసర కొనుగోళ్లకు మాత్రమే అని ఫిక్స్ చేసుకోండి. అంటే కొత్త బట్టలు, షూస్, మేకప్, ఇంటి అలంకరణ వస్తువులు, అవసరం లేని గాడ్జెట్లు. ఈ చాలెంజ్‌ను ఆహారం, మందులు, ప్రయాణం లేదా తప్పనిసరి ఇంటి వస్తువులు వంటి అవసరాలను ఇందులో పెట్టాల్సిన పనిలేదు.
క్యూలో పెట్టండి!
ఏదైనా నచ్చగానే వెంటనే కొనకుండా ఒక జాబితాలో రాసుకోండి. ఇప్పుడే కాదు తర్వాత ఆలోచిద్దాం! అనే రూల్ పెట్టుకోండి. చాలాసార్లు కొన్ని రోజుల తర్వాత అదే వస్తువును చూసి ‘ఇది నాకు ఎందుకు నచ్చింది?’ అనిపించొచ్చు!
షాపింగ్‌కి సెలవులు!
డిస్కౌంట్ నోటిఫికేషన్ రాగానే మనసు బలహీనపడితే, నోటిఫికేషన్లనే ఆపేయాలి. అవసరం లేకుండా షాపింగ్ యాప్‌లు తెరవడం తగ్గిస్తే కొనాలనే ఆలోచన కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్‌తో తోడుగా కూడా షాపింగ్‌కి వెళ్లకండి. కొన్ని రోజులు షాపింగ్‌కి సెలవులు ఇవ్వండి.
ఉన్నదానికి కొత్త జీవితం!
అల్మరాలో దాగి ఉన్న పాత డ్రెస్‌ను కొత్తగా రీ డిజైన్ చేయండి. ఇంట్లో ఉన్న డేకర్ ఐటమ్స్‌ను మరోలా అమర్చండి. నో బై అసలు గెలుపు కొత్తది కొనకపోవడం మాత్రమే కాదు, ఉన్నదాన్ని మళ్లీ ప్రేమించడం!
ఆఫర్ కనిపిస్తే ఆగిపోండి!
ఆఫర్ ఉన్నదని కాదు. లేకున్నా కూడా మీరు ఆ వస్తువును కొనేవారా? అని ప్రశ్నించుకోండి. దానికి సమాధానం ‘నో’ అయితే, అది అవసరం కాదు, ఆఫర్ వేసిన ఆశ! అందుకే, ఇకపై ఆఫర్ వేసే వలలో పడకండి.
లెక్క వేయండి!
30 రోజులు పూర్తయ్యాక ‘ఎంత డబ్బు ఖర్చు చేయలేదు?’, ‘ఏవి కొనాలనిపించాయి?’, ‘వాటిలో నిజంగా ఎన్ని అవసరమయ్యాయి?’ అని చూసుకోండి. అప్పుడే ఈ చాలెంజ్ మీకు కేవలం పొదుపు మాత్రమే కాకుండా, మీ కొనుగోలు అలవాట్లను కూడా ఒక అద్దంలా చూపిస్తుంది.
భావాలతో భారీ నష్టాలు!
బోర్ కొట్టిందా? షాపింగ్‌కి వెళ్దాం! స్ట్రెస్ వచ్చిందా? ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం! పుట్టినరోజా? మనకో గిఫ్ట్ మనమే ఇచ్చుకుందాం! జీతం వచ్చిందా? ఇన్ని రోజులు కష్టపడ్డా కదా ఏదైనా కొనాలి! జీతం రాలేదా? ‘పర్లేదు, తర్వాత చూసుకుందాం!’ అంటూ అదే షాపింగ్! ఇలా... కారణం ఏదైనా పరిష్కారం మాత్రం కార్ట్‌నే అన్నట్టుగా మారిపోయింది. కొన్నిసార్లు అవసరం కంటే, కొత్తది కొన్న ఆ క్షణంలో వచ్చే చిన్న ఆనందమే కావాలి. కొత్త డ్రెస్ తెరిచినప్పుడు వచ్చే ఉత్సాహం, పార్సెల్ చేతికి అందినప్పుడు కలిగే కుతూహలం, ‘ఆర్డర్ ప్లేస్‌డ్’ అని కనిపించినప్పుడు వచ్చే చిన్న గెలుపు ఇవన్నీ కలసి షాపింగ్‌ను వస్తువు కొనడం నుంచి ఒక మూడ్ మార్చే అలవాటుగా మార్చేస్తాయి. కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఇది గమనించండి. ఇలా అవసరం లేకుండానే ఆ ఆనందాన్ని వెతుక్కోవద్దు, ఇదే అలవాటు. తర్వాత భారీ నష్టాలను తెస్తుంది.
మొదలవ్వక ముందే ముగిస్తే!
మొదటి రోజు మన కాన్ఫిడెన్స్ చూస్తే, షాపింగ్ మాల్ మొత్తం మన కోసం మూతపడాల్సిందే అనిపిస్తుంది! ‘ఈ నెల ఏమీ కొనను. ఒక్క రూపాయి కూడా!’ అని శపథం చేస్తాం. మూడో రోజుకే ఒక డ్రెస్ కనిపిస్తుంది. ‘ఇది చాలా అవసరం!’ అన్నట్లుగా... ఇక ఐదో రోజు ఆఫర్ ఆశ చూపిస్తుంది. సరే, ఇది ఒక్కటే అన్నారో, ఇక ఎనిమిదో రోజు మరో పార్సెల్ ఆన్‌లైన్ ఆర్డర్ అంటూ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది. ‘ఇది ఎవరు ఆర్డర్ చేశారు?’ అని అడిగితే ‘అది నేను కాదు నా పాత నిర్ణయం!’ మన మనసుకు మనమే సర్ది చెప్పుకుంటాం.
ఆ పశ్చాతాపంతో వెంటనే, షాపింగ్ యాప్ డిలీట్ చేసినా, ఐదు నిమిషాల్లో మళ్లీ డౌన్ లోడ్! అప్పటికే నో బై కాస్త దారి తప్పేసింది! కానీ అసలు ప్రమాదం, చాలెంజ్ ఫెయిల్ అయింది కదా! అని ఇంకొన్ని కూడా కొందామనుకోవడంలో ఉంది. ఇక్కడే బ్రేక్ వేయాలి. డైట్‌లో ఒక స్వీట్ తిన్నామని మిగతా బాక్స్ మొత్తం తినం కదా అలాగే! ఒక కొనుగోలు జరిగిందంటే మిగతా రోజులకు ‘బై’ పాస్ ఇవ్వొద్దు. ఒక తప్పు జరిగితే మరుసటి కొనుగోలును ఆపడం నుంచే మళ్లీ మొదలు పెట్టొచ్చు.
కలలకు కష్టకాలమా?
‘నో బై చాలెంజ్’ మొదలుపెట్టగానే వాలెట్ నవ్వుతుంది. కానీ మనసు మాత్రం కొంచెం మొహం చాటేస్తుంది! కొంతమంది అసలు ఏమీ కొననని, అత్యవసరమైన వాటిల్లోనూ ఆదా చేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఆహారం, మందులు అంటూ ఆరోగ్యంపై కూడా ఖర్చు చేయకుండా ఉంటే, చివరికి ఆ డబ్బంతా ఆసుపత్రిలో బిల్లు కట్టడానికే వాడతారు. అలాగే, అవసరమైన కోర్సుకు ఫీజు పెట్టడం, పని కోసం ఉపయోగపడే ల్యాప్‌టాప్ కొనకపోవటం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఖర్చు చేయడంం ఇవన్నీ కూడా ‘ఖర్చే కదా!’ అంటూ ఆపేస్తే? ఆదే మీ రేపటి పెద్ద కలలకే బ్రేక్ పడొచ్చు.
మరికొంతమంది ఇన్నాళ్లు ఆపుకున్న కోరికలతో చాలెంజ్ పూర్తయ్యాక ఒక్కసారిగా ‘ఇప్పుడైనా అన్నీ కొనేయాలి!’ అని 30 రోజుల సేవింగ్‌కి 30 నిమిషాల్లో ఫుల్‌స్టాప్ పెట్టేస్తారు. అందుకే, ఇక్కడ కేవలం చిన్న కోరికల్ని కాస్త వాయిదా వేసి, పెద్ద కలలకు కాస్త ముందడుగు వేయాలి. ఎందుకంటే కలల కోసం ఖర్చు చేయడం నష్టం కాదు. కలల్ని వదిలేసి పొదుపు చేయడమే అసలు నష్టం!
డబ్బే కాదు, దొరికేవి చాలా!
ఒక వస్తువు కొనలేదు అంటే మనకు మిగిలేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇంట్లో అవి చేసుకునే కబ్జాను కూడా ఆపేయొచ్చు. అంటే కొత్త బాక్స్, కొత్త బాటిల్, కొత్త డ్రెస్, కొత్త డెకర్ అంటూ ఇంట్లోకి వస్తువులు వరుస కట్టకపోతే అల్మరా కూడా మనల్ని చూసి ‘ధన్యవాదాలు!’ అంటుంది. దానికి తోడు సమయం కూడా మిగులుతుంది. ఏది కొనాలి? ఏది బాగుంటుంది? ఏ బ్రాండ్? ఏ రంగు? ఎక్కడ చౌక? రివ్యూలు ఎలా ఉన్నాయి? అంటూ గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన పని తగ్గుతుంది. ఒకసారి కొన్నాక దానికి చోటు చూడాలి, సర్దాలి, శుభ్రం చేయాలి, పాడైతే రిపేర్ చేయించాలి– ఇలా ఒక చిన్న కొనుగోలు వెనక వచ్చే చిన్న చిన్న పనుల బెడద కూడా తగ్గిపోతుంది. అలా చివరికి ఈ చాలెంజ్ మనకు చాలా లాభం చూపిస్తుంది.
కొత్తది కొనకుండా ఉండటమే ఈ చాలెంజ్ విజయం కాదు. మన డబ్బు, మన కోరికలు, మన నిర్ణయాల మీద పట్టు తెచ్చుకోవడమే అసలు గెలుపు.
∙ కొండి దీపిక


