నడివయసులోకి వచ్చాక చాలామంది మెట్లెక్కడానికే ఆయాసపడతారు. తొంభైఏళ్లు దాటిన ఈ అమెరికన్ వృద్ధుడు మాత్రం పడుతూ లేస్తూ... మొత్తానికి పర్వత శిఖరాన్నే అధిరోహించాడు. అమెరికా ఈశాన్యాన ఉన్న న్యూఇంగ్లండ్ ప్రాంతంలోని ‘మౌంట్ మీన్’ శిఖరాన్ని అధిరోహించిన ఈ పెద్దాయన పేరు డేల్ సాండర్స్. ఈయన వయసు 91 ఏళ్లు. ‘మౌంట్ మీన్’ శిఖరారోహణ కోసం ఈ పెద్దమనిషి జార్జియాలోని స్ప్రింగర్ పర్వతం నుంచి న్యూఇంగ్లండ్‌లోని ‘మౌంట్ మీన్’ వరకు ఏకంగా 3,529 కిలోమీటర్లు కొండదారిలో ప్రయాణించాడు.
ఈ ప్రయాణంలో ఆయన 71 సార్లు జారిపడ్డాడు. పడిన ప్రతిసారీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో తిరిగి పైకిలేచాడు. పట్టువదలకుండా, విజయవంతంగా శిఖరారోహణ చేశాడు. ఈ శిఖరాన్ని అధిరోహించడం సాండర్స్‌కు ఇదే మొదటిసారి కాదు, ఇదివరకు 2017లో కూడా తన 82 ఏళ్ల వయసులోనూ ఆయన ఈ శిఖరాన్ని అధిరోహించాడు. తాజాగా తన రికార్డును తానే పునరావృతం చేశాడు.


