Photo Credit: Twitter
శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇరుజట్ల మధ్య పాయింట్ల రేటింగ్ మధ్య వ్యత్యాసం లేకపోయినప్పటికీ, మ్యాచ్ పరంగా టీమిండియా (61)తో పోలిస్తే ఇంగ్లండ్ 41 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌతాఫ్రికాలు వరుసగా మూడు, నాలుగు, స్థానాల్లో కొనసాగుతున్నాయి.
👉ఇక మ్యాచ్‌లో అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించిన జోస్ బట్లర్ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజా అర్థసెంచరీతో బట్లర్ ఖాతాలో 32 హాఫ్ సెంచరీలున్నాయి. బట్లర్ కంటే ముందు బాబర్ ఆజం (42 అర్థసెంచరీలు), విరాట్ కోహ్లి (39 అర్థసెంచరీలు), రోహిత్ శర్మ (37 అర్థసెంచరీలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
👉ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. లంకతో టీ20 సిరీస్‌లో బట్లర్ 171 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాపై 173 పరుగులతో డేవిడ్ మలన్.. బట్లర్ కంటే ముందున్నాడు. ఇక కెప్టెన్ హ్యారీ బ్రూక్ (170 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
👉ఇక మ్యాచ్ విషయానికొస్తే శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), కమిందు మెండిస్ (35) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే ఒక వికెట్ తీశాడు. ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది.
ఇదీ చదవండి: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్


