PC: BCCI/X
భారత క్రికెట్ నియంత్రణ మండలి తన 100 ఏళ్ల ఘనమైన ప్రయాణాన్ని అత్యంత వైభవంగా సెల్‌బ్రేట్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. ఈ శతాబ్ది ఉత్సవాలను క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మార్చేందుకు ఒక ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ఉత్సవాల సందర్భంగా 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' మధ్య ఒక చారిత్రక మ్యాచ్ జరగనున్నట్లు 'ఆనందబజార్ పత్రిక' తన కథనంలో పేర్కొంది. ఇది గనుక కార్యరూపం దాల్చితే భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే మైదానంలో చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కుతుంది.
ఈ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీసీసీఐ ఏజీఎం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాకుండా, గత వంద ఏళ్లలో భారత క్రికెట్ ప్రస్థానాన్ని మరియు ప్రపంచ క్రికెట్‌లో భారత్ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా పలు విశేష క్రీడా కార్యక్రమాలను సైతం బీసీసీఐ నిర్వహించనుంది.
భారత జట్టు 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్'తో తలపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 1994-95 సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య పరిమిత ఓవర్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మొదటి మ్యాచ్ 1994 జూన్ 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 45 ఓవర్ల డే-నైట్ మ్యాచ్‌గా జరిగింది.
ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఎలెవన్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (151) అద్భుత సెంచరీతో విరుచుకుపడగా, వినోద్ కాంబ్లీ (45) కూడా రాణించాడు. అనంతరం 264 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్' నిర్ణీత 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులకే పరిమితమైంది.
ఆ తర్వాత రెండో మ్యాచ్ 1995 మార్చి 24న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఇదే. ఇప్పుడు మళ్లీ దాదాపు 31 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ముఖాముఖి తలపడటానికి సిద్ధమవుతుండటం విశేషం.
చదవండి: 'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'


