PC: BCCI X
భారత మహిళా, పురుష క్రికెట్ జట్లకు మరోసారి ‘నక్వీ గండం’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు-2026 టోర్నీలోనూ అతడి చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. కాగా ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రెండుసార్లు నిరాకరణ
అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు, ఇటీవల 2026లో ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఇంతవరకు ట్రోఫీలు భారత్‌కు అందకుండా నక్వీ పావులు కదుపుతున్నాడు.
హాట్ ఫేవరెట్‌గా భారత జట్లు
ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. జపాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ విభాగంలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా.. డిఫెండింగ్ చాంపియన్లు టీమిండియా, భారత మహిళా జట్టు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి.
ఇక్కడా అదే గండం.. నిరాకరిస్తే కష్టమే!
ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్న ఇరుజట్లు దాదాపు స్వర్ణం గెలవడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఆసియా ఒలింపిక్ మండలి (OCA)లో భాగమైన నక్వీకి గనుక పతకాలు ప్రదానం చేసే అవకాశం వస్తే.. భారత జట్లు తప్పక అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆసియా క్రీడలనే అవమానించినట్లుగా అవుతుంది. తద్వారా పతకాలు నిరాకరించిన జట్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
స్పందించిన బీసీసీఐ
ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించారు. ‘‘ముందుగా మ్యాచ్‌లు గెలవడంపైనే మా దృష్టి ఉంది. భారత జట్లు స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్దకు వెళ్లాలి. అప్పుడే మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాము.
ప్రస్తుతం మా దృష్టి మొత్తం మ్యాచ్‌లు గెలవడం మీదే ఉంది. బోర్డు, ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రాధాన్యం. ఇప్పటి వరకు జరగని దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.
నిబంధనలు ఇవే
కాగా ఆసియా ఒలింపిక్ మండలి నియావళిలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ‘విజయాలు, పతకాల ప్రదానోత్సం’లో భాగంగా విజేతలకు OCA అధ్యక్షుడు నేరుగా మెడల్ ప్రదానం చేయవచ్చు. లేదంటే.. మండలిలో భాగమైన ఇతర సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయ, మతపరమైన, వాణిజ్యపరమైన అంశాలకు తావు ఉండదు.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్


