సిక్కోలు క్రికెటర్ త్రిపురాన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టు వైపు అడుగులు వేస్తున్నాడు. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్‌రౌండర్ తాజాగా భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్లీడే (టెస్టు)మ్యాచ్‌లలో పాల్గొనే భారత్–ఏ జట్టుకు ఎంపికైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తన కలకు ఒకే ఒక్క అడు గు దూరంలో నిలిచాడు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీ స్ జట్టు భారత్‌కు వస్తున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ నుంచి పిలుపు
కర్ణాటకకు చెందిన యువ పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌కు గాయం కారణంగా దూరం కావడంతో అనూహ్యంగా ఆంధ్రాకు చెందిన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. ఆసీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రాణించి భారత సెలక్షన్ కమిటీని ఆకట్టుకోవాలని విజయ్ భావిస్తున్నాడు.
ఆల్‌రౌండర్‌గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్‌గా అనేక మ్యాచ్‌ల్లో రివార్డులు అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణింపుతో.. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రాణించడం ద్వారా సిక్కోలు యువతేజం విజయ్.. భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు.
వైభవ్‌ను అవుట్ చేసి లైమ్‌లైట్‌లోకి..
ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ వంటి ఇండియన్ టాప్‌క్లాస్ ప్లేయర్లను ఔట్ చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. సౌత్‌జోన్‌కు ప్రధానమైన ఆఫ్ స్పిన్నర్‌గా సేవలు అందించాడు.
ఇప్పటికే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్‌కు 2025, 2026 రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జూలై నెలలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురు షుల క్రికెట్ టోర్నీలో ఇండియా–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు.
భారత్–ఏ జట్టుకు విజయ్ ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు, విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు త్రిపురాన విజయ్ తండ్రి త్రిపురాన వెంకట కృష్ణరాజు సమాచార శాఖ ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. విజయ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అభినందించారు.
పట్టలేనంత ఆనందంతో ఉన్నాను
ఆసీస్‌తో జరిగే మల్టీ డే మ్యాచ్‌లో పాల్గొనే భారత–ఏ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్‌లో నన్ను చేర్చినట్టు వర్తమానం వచ్చిన ఆనందక్షణాలు మర్చిపోలేను. ఇటీవలి ఎమర్జింగ్ టోర్నీ, దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రాణింపుతో సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.
– త్రిపురాన విజయ్, క్రికెటర్


