సెమీస్‌లో ఓటమి.. అయినా మరో అవకాశం! | Who Is Quimcy Dsouza Indian Teqball Star Loses Semis Will fight for Bronze | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓటమి.. అయినా మరో అవకాశం!

Sep 19 2026 11:03 AM | Updated on Sep 19 2026 11:35 AM

Who Is Quimcy Dsouza Indian Teqball Star Loses Semis Will fight for Bronze

క్విమ్సీ డిసౌజా

ఆసియా క్రీడలు-2026లో భారత టెక్‌బాల్‌ స్టార్‌ క్విమ్సీ డిసౌజాకు చేదు అనుభవం ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ఆది నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబైకర్‌ సెమీ ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది.

ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయతో సెమీస్‌లో తలపడ్డ క్విమ్సీ తొలి సెట్‌ను 12-7తో గెలుచుకుంది. అయితే, సుమయ అనూహ్య రీతిలో పుంజుకుని రెండో సెట్‌ను 12-9తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో పట్టువదలని సుమయ 12-7తో క్విమ్సీపై పైచేయి సాధించింది.

ఫలితంగా సుమయా ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో ఓడినప్పటికీ క్విమ్సీకి పతకం గెలిచేందుకు మరో అవకాశం ఉంది. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో ఆమె జపాన్‌కు చెందిన యియునా సకామొటోతో అమీతుమీ తేల్చుకుంటుంది. 

ఎవరీ క్విమ్సీ డిసౌజా?
ముంబైకి చెందిన క్విమ్సీ పదమూడేళ్ల వయసులో మిడిల్‌ డిస్టాన్స్‌ రన్నర్‌గా తన క్రీడా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న 24 ఏళ్ల ఈ అమ్మాయి ఏజ్‌ గ్రూప్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించింది.

అయితే, ఆశించిన రీతిలో కెరీర్‌ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో క్విమ్సీ.. చదువు మీద శ్రద్ధ పెట్టింది. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి.. క్రీడా వస్తువుల రీటైలర్‌ డెకథ్లాన్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆమెకు టెక్‌బాల్‌ పరిచయమైంది.

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం రినాల్డిన్హో ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో టెక్‌బాల్‌ ఆటను వీక్షించిన క్విమ్సీకి ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో కఠోర శ్రమతో క్రమక్రమంగా భారత టెక్‌బాల్‌ స్టార్‌గా ఎదిగింది. అంతర్జాతీయ స్థాయిలో టెక్‌బాల్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి మహిళా టెకర్‌గా నిలిచింది.

ఏడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన క్విమ్సీ.. బెంగళూరులో టెక్‌బాల్‌ క్లబ్‌ స్థాపించి.. క్రీడను ప్రోత్సహిస్తోంది. ఇటీవల రొమేనియాలో జరిగిన టెక్‌బాల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో క్విమ్సీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇక తాజాగా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో గ్రూప్‌-ఎ నుంచి తలపడ్డ క్విమ్సీ.. తొలుత జపాన్‌ టెకర్‌ యియునా సకామొటోపై 2-1తో గెలిచింది. ఆ తర్వాత కాంబోడియా టెకర్‌ కొయెమైయన్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో మాత్రం ఓటమి ఎదురైనప్పటికీ.. కాంస్య పతక పోరులో నిలవగలిగింది.

ఏమిటీ టెక్‌బాల్‌?
ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ల కలయికే ఈ గేమ్‌. వాలుగా ఉన్న టేబుల్‌ పైనున్న నెట్‌ మీదుగా.. ఆటగాళ్లు తమ పాదాలు, కాళ్లు, ఛాతీ, తలతో ఫుట్‌బాల్‌ను కొడుతుంటారు. చేతులు, భుజాలు కాకుండా శరీరంలోని ఏ భాగంతోనైనా ఫుట్‌బాల్‌ను హిట్‌ చేయొచ్చు. సింగిల్స్‌, డబుల్స్‌ ఫార్మాట్లలో దీనిని నిర్వహిస్తారు. హంగేరీలో 2014లో ఈ క్రీడను కనుగొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement