Photo Credit: BCCI Women X
జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా బౌలర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. నాలుగు వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేసింది.
శ్రీ చరణితో పాటు షఫాలి వర్మ, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ కూడా రాణించారు. ఫలితంగా జపాన్ మహిళా క్రికెట్ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. జపాన్‌లోని నిశిన్ వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది.
ఓపెనర్లు హరునా ఇవాసాకి పది పరుగులు చేయగా.. అయాక కాటో- స్టఫోర్డ్ 25 పరుగులతో సత్తా చాటింది. అయితే, హరూనాను అవుట్ చేసి శ్రీ చరణి వికెట్ల వేట మొదలుపెట్టగా.. అయాకను షఫాలి వర్మ పెవిలియన్‌కు పంపింది.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మైయ్ యనగిడను శ్రీ చరణి డకౌట్ చేయగా.. ఎరికా ఓడా (5)ను దీప్తి శర్మ వెనక్కి పంపింది. ఐదో స్థానం నుంచి మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.
షిమాకో కాటో 3, అకారి నిశిముర కానో 2, వికెట్ కీపర్ బ్యాటర్ హినాసే గోటో 1, అహిల్య చందేల్ 0, ఆయుమి ఫుజికావా 4 (నాటౌట్), ఎరికా టొగుచి క్విన్ 0, నొనొహ యసుమొటో 0 పరుగులు చేశారు.
శ్రీచరణి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 10 పరుగులే ఇచ్చి.. హరునా, మైయ్, అకారి, ఎరిక వికెట్లు పడగొట్టింది. షఫాలి వర్మ నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ 3.5 ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది.
దీప్తి శర్మ పూర్తి కోటా బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. నిజానికి పసికూన జపాన్ 19.5 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా ఉండటమే విశేషం.
తుదిజట్లు
భారత్
స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ
జపాన్
హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో.


