గంభీర్ (Photo Credit: BCCI/Sonysports)
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఢిల్లీ వేదికగా అఫ్గాన్ ఆతిథ్యం ఇచ్చిన మూడు టీ20లలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. గత సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.
మెరుపు అర్ద శతకాలు
అయినప్పటికీ అఫ్గాన్‌తో సిరీస్‌లో యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి రావడంతో అభిషేక్ శర్మకు జోడీగా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ (10)లో విఫలమైనప్పటికీ మిగిలిన రెండు టీ20లలో సంజూ మెరుపు అర్ధ శతకాల (57, 50)తో దుమ్ములేపాడు.
కుండబద్దలు కొట్టిన గంభీర్
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు వేచి చూడకతప్పని పరిస్థితి నెలకొంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘వైభవ్ దృష్టి కోణం నుంచి చూసినప్పటికీ.. అతడు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది.
అతడు ఎంతటి ప్రతిభావంతుడో మాకూ తెలుసు. అద్భుతాలు చేయగల సామర్థ్యం అతడికి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం దక్కడం సహజం. అలాంటి ప్లేయర్లకు దీర్ఘకాలం అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక సంజూ శాంసన్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆటగాడు అతడు. ప్రతిభ లేకుండా ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేరు కదా!.. తన శక్తి మేర జట్టు కోసం అతడు పనిచేశాడు.
సంజూను పక్కనపెట్టాను.. అదే కఠిన నిర్ణయం
ఏదేమైనా ఇంగ్లండ్ పర్యటనలో సంజూను తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. నా కోచింగ్ కెరీర్‌లో ఇదే అత్యంత కఠిన నిర్ణయం అనుకుంటాను. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడు విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.
అయితే, కొన్నిసార్లు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనసాగిస్తాం. మరికొన్నిసార్లు ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో సత్తా చాటిన కాంబినేషన్‌ను కొనసాగించాలని భావిస్తాం. రెండు, మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన వారిపై చెత్త ఆటగాళ్లుగా ముద్రవేయలేము.
మా జట్టు బాగుంది
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో మాకు చేదు అనుభవం ఎదురైన మాట వాస్తవమే. కానీ గత ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఆ తర్వాత వెంటనే మరో వరల్డ్‌కప్ టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు.. ఒకటీ రెండు ఓటముల కారణంగా చెడ్డది అయిపోదు’’ అని గంభీర్ శ్రేయస్ అయ్యర్ సేనను సమర్థించాడు.
కాగా అఫ్గాన్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనలో కూడా ఇదే ఫలితం సాధించింది. అయితే, యూకే టూర్‌లో భాగంగా ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో శ్రేయస్ అయ్యర్ సేన క్లీన్‌స్వీప్ అయింది.


