భారత్‌ ఘన విజయం.. సెమీ ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే? | Asian Games 2026, India Beat Japan By 8 Wickets And Enter Semis, Check All Semifinalists, Schedule And Timings | Sakshi
Sakshi News home page

భారత్‌ ఘన విజయం.. సెమీ ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే?

Sep 18 2026 12:23 PM | Updated on Sep 18 2026 12:57 PM

W Asian Games 2026: India Beat Japan Enters Semis Check All Semifinalists

భారత మహిళా జట్టు (PC: BCCI Women X)

ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జపాన్‌ మహిళా జట్టుతో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది..  సెమీస్‌కు దూసుకువెళ్లింది.

అదరగొట్టిన కడప అమ్మాయి
నిశిన్‌లోని కరోగి స్పోర్ట్స్‌ పార్కులో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జపాన్‌ 57 పరుగులకే కుప్పకూలింది. 

భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణి (4/10) అద్భుత ప్రదర్శన కనబరచగా.. షఫాలి వర్మ (2/13), శ్రేయాంక పాటిల్‌ (1/9), దీప్తి శర్మ (1/14) కూడా రాణించారు.  ఇక జపాన్‌ విధించిన 58 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఐదు ఓవర్లలోనే ఊదేసింది.  

షఫాలి విధ్వంసం
వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానకు బదులుగా ఓపెనర్‌ వచ్చిన 18 ఏళ్ల గుణాలన్‌ కమిలిని డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ షఫాలి వర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. కేవలం 15 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి.. 40 పరుగులతో అజేయంగా నిలిచింది. ఐదో ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాది టీమిండియా గెలుపును ఖరారు చేసింది.

మిగిలిన వారిలో వన్‌డౌన్‌లో వచ్చిన భారతి ఫుల్మలి ఆరు పరుగులు చేసి అవుట్‌ కాగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ 6 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది. జపాన్‌ బౌలర్లలో నొనొహ యసుమొటో, అయాక కాటో- స్టఫోర్ట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా సెమీ ఫైనల్లో భారత్‌ బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది.

సెమీస్‌ చేరిన జట్లు ఇవే
నిశిన్‌ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌- చైనా మధ్య తొలి క్వార్టర్‌ ఫైనల్‌ వర్షం వల్ల రద్దు కాగా.. ర్యాంకింగ్స్‌ ఆధారంగా బంగ్లా సెమీస్‌కు చేరింది. రెండో క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై పాకిస్తాన్‌ గెలిచి.. టాప్‌-4కు అర్హత సాధించింది. తాజాగా శుక్రవారం నాటి మూడో క్వార్టర్‌ ఫైనల్లో మలేషియాపై శ్రీలంక.. జపాన్‌పై భారత్‌ గెలిచి సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.

సెమీ ఫైనల్‌ షెడ్యూల్‌ ఇదే
సెప్టెంబరు 20 (ఆదివారం)- తొలి సెమీ ఫైనల్‌- పాకిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక- భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం
సెప్టెంబరు 20 (ఆదివారం)- రెండో సెమీ ఫైనల్‌- భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌- భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం
వేదిక: కరోగి స్పోర్ట్స్‌ పార్కు, నిశిన్‌, జపాన్‌.

చదవండి: సంజూను పక్కన పెట్టాను.. అతడు వేచి చూడాల్సిందే: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement