ఆసియా...ఆటాడుకుందాం రా..! | 20th Asian Games set to open in central Japan | Sakshi
Sakshi News home page

ఆసియా...ఆటాడుకుందాం రా..!

Sep 19 2026 6:00 AM | Updated on Sep 19 2026 6:00 AM

20th Asian Games set to open in central Japan

నేటి నుంచి ఏషియాడ్‌–2026

జపాన్‌ వేదికగా ప్రతిష్టాత్మక ఈవెంట్‌

అక్టోబర్‌ 4న ముగింపు

సమన్వయ లోపంతో జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆలస్యం

నేడు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ప్రారంభోత్సవం

సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

46 దేశాలు... 43 వేర్వేరు క్రీడలు... 71 క్రీడాంశాలు... 469 మెడల్‌ ఈవెంట్లు... 17 వేలకు పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు... ఆటగాళ్ల సంఖ్యాపరంగా చూస్తే ఒలింపిక్స్‌కంటే పెద్ద క్రీడా సంబరం... రెండు వారాల పాటు ఉత్కంఠభరిత పోటీలు... నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు నేటితో తెర లేవనుంది. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీల్లో 20వ సారి ఈ ఆటల సంబరాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్‌... ఆరంభ విఘ్నాలను దాటి అద్భుతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తోంది.  

నగోయా: ఆసియా ఖండపు క్రీడాకారుల సత్తాకు పరీక్షగా నిలిచే క్రీడా పోటీలకు విజిల్‌ మోగింది. అధికారికంగా నేటి నుంచి 20వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా శనివారమే నిర్వహిస్తారు. అక్టోబర్‌ 4న పోటీలు ముగుస్తాయి. ఐషీ రాష్ట్ర రాజధాని నగోయా నగరంతో పాటు నగోయా శివార్లలోని ఇతర ప్రాంతాల్లో వేర్వేరు వేదికల్లో పోటీలు జరుగుతాయి. ఆసియా క్రీడల కోసం సుమారు 2.4 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించారు. 

అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చులో క్రీడలను నిర్వహించే క్రమంలో శాశ్వత కట్టడాలేమీ ఎక్కువగా లేకుండా జపాన్‌ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దాంతో ప్రత్యేకంగా ఆటగాళ్ల కోసం ‘గేమ్స్‌ విలేజ్‌’ ఏర్పాటు చేయకుండా అందుబాటులో ఉన్న సౌకర్యాలలోనే వసతి, ఇతర ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో ఆటగాళ్ల నుంచి కొంత అసంతృప్తి కనిపిస్తున్నా... నిర్వాహకులు మాత్రం తమ ప్రణాళికలకే కట్టుబడి గేమ్స్‌ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్చరీ, హాకీ, టెన్నిస్, స్క్వాష్ లలో ఆసియా క్రీడల ప్రదర్శన ఆధారంగా 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంది.  

భారత జెండా ఎగిరింది... 
ఆసియా క్రీడల సాంప్రదాయాన్ని అనుసరించి శుక్రవారం ప్రధాన వేదిక వద్ద వివిధ దేశాల జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్, క్రీడల నిర్వహణ కమిటీ మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ కార్యక్రమం షెడ్యూల్‌కంటే ఆలస్యంగా జరిగింది. జపాన్‌ సాంప్రదాయ శైలి సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వేడుకను నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో భారత చెఫ్‌ డి మిషన్‌ సహదేవ్‌ యాదవ్‌తో పాటు నలుగురు డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌లు శరత్‌ కమల్, తోటన్, అలకనంద, అంజలి భగవత్‌ హాజరయ్యారు.

ఫ్లాగ్‌ బేరర్లుగా తజీందర్, మనూ... 
ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్‌ తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఫ్లాగ్‌ బేరర్లుగా వ్యవహరించనున్నారు. షాట్‌పుట్‌ డిఫెండింగ్‌  చాంపియన్‌ తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్, షూటర్‌ మనూ భాకర్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మను భాకర్‌ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకుంది. ఆసియాడ్‌లో ఎక్కువ పతకాలు సాధించే క్రీడాంశాలైన షూటింగ్, అథ్లెటిక్స్‌ ప్రతినిధులుగా వీరిద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

భారత్‌ నుంచి 501 మంది బరిలో...
ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇన్నేళ్లుగా మంచి రికార్డు ఉంది. 1951 నుంచి 2023 వరకు జరిగిన 19 ఏషియాడ్‌లలో పాల్గొన్న భారత్‌ ఓవరాల్‌గా ఆల్‌టైమ్‌ పతకాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. భారత్‌ ఇప్పటి వరకు 183 స్వర్ణాలు, 238 రజతాలు, 357 కాంస్యాలు కలిపి మొత్తం 778 పతకాలు గెలుచుకుంది. 

చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్‌ మన కంటే ముందున్నాయి. చైనాలోని హాంగ్జూలో జరిగిన గత ఆసియా క్రీడల్లో 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన (28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలు) భారత్‌ ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో సిద్ధమైంది. 

2018 క్రీడలతో పోలిస్తే ఏకంగా 36 పతకాలు ఎక్కువ గెలిచి తొలిసారి సెంచరీ దాటిన మన దేశం ఈసారి మరింత పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఎప్పటిలాగే అథ్లెటిక్స్, షూటింగ్‌లలో భారత్‌కు ఎక్కువ పతకాలు లభించే అవకాశం ఉంది. మొత్తం 501 మంది సభ్యుల బృందంతో భారత్‌ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. వీరిలో 267 మంది పురుష అథ్లెట్లు, 234 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. 

ఆసియా క్రీడల్లో 43 వేర్వేరు క్రీడలు ఉండగా... భారత్‌ 36 క్రీడల్లో పాల్గొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 21 మంది ఆటగాళ్లు ఏషియాడ్‌లో పోటీ పడుతున్నారు. మన ఆటగాళ్ల శిక్షణ, ఎక్విప్‌మెంట్, కోచ్‌లు, ఆర్థిక సహకారం తదితర అంశాలు కలిపి ఆసియా క్రీడల సన్నద్ధత కోసం రూ. 703 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఆసక్తికరం.

సమస్యలు సహజమే: నిర్వాహకులు
పెద్ద క్రీడా ఈవెంట్ల నిర్వహణలో పలు సవాళ్లు ఉంటాయని, కొన్ని సమస్యలు సహజంగానే వస్తాయని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా వసతి, ఇతర సౌకర్యాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్‌ తయ్యబ్‌ ఇక్రమ్‌ వివరణ ఇచ్చారు. ‘క్రీడల్లో కలి్పంచే సౌకర్యాల విషయంలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని రాజకీయం చేయవద్దు. కొందరు ప్రతీ విషయంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏ క్రీడల్లో సమస్యలు లేకుండా ఉంటాయి. వాటిని మేం ఎలా పరిష్కరిస్తామనేది ముఖ్యం. 

గేమ్స్‌ విలేజ్‌ ఏర్పాటు చేయాల్సిందనే వాదన వినిపించింది. అయితే మనం వాస్తవిక దృష్టితో ఆలోచించాలి. ఖర్చు తగ్గించుకోవాలి కదా. ఆటల తర్వాత దానిని ఏం చేస్తాం. 2030, 2034 ఆసియా క్రీడల్లో గేమ్స్‌ విలేజ్‌లు ఉంటాయి’ అని ఆయన వివరించారు. మరోవైపు 2038 ఆసియా క్రీడలకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చే అంశంపై 2028లోనే స్పష్టత వస్తుందని ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆసియా (ఓసీఏ) పేర్కొంది. ఈ క్రీడల కోసం భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా పోటీ పడుతున్నాయని, ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని ఓసీఏ అధికారులు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement