సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేసి ‘హ్యాట్రిక్’ సాధించాయి. భారత మహిళల జట్టు 3.5–0.5తో గ్రీస్‌ను ఓడించింది. బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 46 ఎత్తుల్లో స్టావ్‌రూలా సొలాకిడూపై గెలిచింది. బోర్డు–2పై దివ్యదేశ్‌ముఖ్, అనస్తాసియా అవ్రామిడూ గేమ్ 49 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది.
బోర్డు–3పై వంతిక అగర్వాల్ 44 ఎత్తుల్లో ఎకతెరీని పావ్లిడూపై... బోర్డు–4పై సవితా శ్రీ 66 ఎత్తుల్లో అంటోనియా క్రిస్టోడులాకీపై గెలుపొందారు. భారత పురుషుల జట్టు 3–1తో ఇటలీపై నెగ్గింది. బోర్డు–1పై ప్రజ్ఞానంద, లొరెంజో లోడికి గేమ్ 41 ఎత్తుల్లో... బోర్డు–2పై ఇరిగేశి అర్జున్–లుకా మొరోని గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. బోర్డు–3పై నిహాల్ సరీన్ 40 ఎత్తుల్లో ఫ్రాన్సెస్కో సోనిస్‌పై... బోర్డు–4పై దొమ్మరాజు గుకేశ్ 33 ఎత్తుల్లో సబీనో బ్రునెల్లోపై గెలుపొందారు. నేడు జరిగే నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో భారత పురుషుల జట్టు; మంగోలియాతో భారత మహిళల జట్టు తలపడతాయి.


