మనూ భాకర్‌తో పవన్ సెహ్రావత్ (PC: Team India)
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 ఘనంగా మొదలయ్యాయి. ఈ ఆరంభ వేడుకల్లో ఒలింపిక్ పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో పాటు.. కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. నిజానికి తొలుత మనూ భాకర్‌తో కలిసి షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికయ్యాడు.
ఊహించని అవకాశం
అయితే, కిట్ ఆలస్యంగా రావడం వల్ల మనూకు జతగా ఉన్న మరో భారత పతాకధారిని మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్‌కు ఊహించని విధంగా ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చింది. మనూ భాకర్‌తో కలిసి అతడు భారత పతాకధారిగా వ్యవహరించాడు.
రాత్రి అసలు నిద్రపోనేలేదు
ఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్ మాట్లాడుతూ.. ‘‘నాకిది అత్యంత గర్వించదగ్గ క్షణం. నిజానికి మాకు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంది. అందుకు తగినట్లుగానే మేమంతా ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాము. రాత్రి అసలు నిద్రపోనేలేదు.
పొద్దునే జిమ్‌కు వెళ్లి నేరుగా స్టేడియానికి వచ్చేశాను. రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను. అయినా సరే జాతీయ పతాకాధారిగా వస్తున్నానని తెలిసి ఎక్కడా లేని ఉత్సాహం, శక్తి వచ్చాయి. నిజంగా నాకు ఇది గర్వకారణం.
ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్
నిజానికి నాకు ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చిందని ఈరోజు ఉదయమే అందరికీ చెప్పాను. అయితే, మా అన్నయ్య అంకుర్‌కు మాత్రం గత రాత్రే మెసేజ్ చేశాను. ఇక మనూ భాకర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు.
ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్. ఇంతకు ముందే ఆమెను ఓసారి కలిశాను. ఒలింపిక్ పతక విజేతతో కలిసి ఫ్లాగ్ బేరర్‌గా ఉండటం గర్వించదగ్గ విషయం.
మా జట్టును ఉద్దేశించి మనూ గతంలో స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చారు. ఇప్పుడిలా ఆమెతో కలిసి నేను పతాకధారిగా ఉండటం ఊహించని విషయం’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం పవన్ సెహ్రావత్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
POV : You’re walking out along with our flag bearers at the Opening Cermony. 🥹🥹
The incredible moments as our contingent marches during the Opening Ceremony! As the @asiangames_2026 are officially open, here’s wishing our contingent the very best on a successful games ahead.… pic.twitter.com/Kipe4elYGv— Team India (@WeAreTeamIndia) September 19, 2026


