నితీశ్‌ రెడ్డిపై గంభీర్‌ ప్రశంసలు.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయమే! | Hardik and Reddy can be in same XI: Gambhir Lauds Nitish Kumar Reddy | Sakshi
Sakshi News home page

నితీశ్‌ రెడ్డిపై గంభీర్‌ ప్రశంసలు.. వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయమే!

Sep 19 2026 1:38 PM | Updated on Sep 19 2026 1:51 PM

Hardik and Reddy can be in same XI: Gambhir Lauds Nitish Kumar Reddy

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (PC: BCCI X)

ఆంధ్ర పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేస్‌ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం చాలా ఎక్కువ. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో అది మరింత అధికం. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటం శుభ పరిణామం’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే సీనియర్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను అంతర్జాతీయ మ్యాచ్‌లకు పరిశీలిస్తామని గంభీర్‌ అన్నాడు. హార్దిక్, నితీశ్‌లను ఒకే మ్యాచ్‌లో ఆడించే ఆలోచన కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపాడు. 

వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు తగినన్ని అవకాశాలు
‘గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన హార్దిక్‌ పాండ్యా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. పది ఓవర్లు బౌలింగ్‌ చేయగల ఫిట్‌నెస్‌ సాధించిన అనంతరమే అతడి ఎంపికను పరిశీలిస్తాం.

కోలుకోకముందే అతడిని అంతర్జాతీయ క్రికెట్‌ ఒత్తిడిలో పడేయాలనుకోవడం లేదు. ప్రస్తుతం భారత ‘ఎ’జట్టు తరఫున అతడికి మంచి ప్రాక్టీస్‌ దక్కనుంది. పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత అతడిని, నితీశ్‌ను కలిపి ఒకే జట్టులో ఆడించాలనుకుంటున్నాం.

నితీశ్‌ రెడ్డిని ఆసియా క్రీడల జట్టు నుంచి తీసి... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ కోసం కేటాయించాం. వరల్డ్‌కప్‌ వంటి పెద్ద టోర్నీలకు ముందు అతడికి తగినన్ని అవకాశాలివ్వాలని అనుకుంటున్నాం. 

అతడి బౌలింగ్‌ పదునెక్కింది
ఇటీవలి కాలంలో అతడి బౌలింగ్‌ పదునెక్కింది. అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20లో అదే కనిపించింది. తొలి ఓవర్‌లో 15 పరుగులు ఇచ్చిన తర్వాత తిరిగి పుంజుకుని మూడు వికెట్లతో సత్తాచాటాడు.  

వన్డే, టీ20 ఫార్మాట్‌లలో అటు బౌలింగ్‌ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే నితీశ్‌కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తాము. 

ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమే!
అఫ్గాన్‌తో తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్‌ ప్రతిభ బయటపడింది’’ అని గంభీర్‌ నితీశ్‌ రెడ్డిని ప్రశంసించాడు. 

వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టులో ఈ ఆంధ్ర కుర్రాడికి చోటు ఖాయమైపోయిందనే సంకేతాలు ఇచ్చాడు. టీమిండియా అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20లో గెలిచి.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ గంభీర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్‌ బ్యాటర్‌ అతడే: కమిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement