కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్‌తో పంత్ (PC: BCCI X)
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటిచ్చింది.
ఇద్దరికీ మొండిచేయి
అయితే, గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌తో వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తారని విశ్లేషకులు భావించారు.
కానీ సెలక్టర్లు మాత్రం వీరిద్దరికి మొండిచేయి చూపారు. హార్దిక్ భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని విండీస్‌తో వన్డే జట్టుకు ఎంపిక చేశారు.
ఊహించని రీతిలో
అదే విధంగా.. పంత్‌ను కాదని యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. నిజానికి రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ లేదంటే పంత్‌నే ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇషాన్ టీ20 జట్టుతో బిజీగా ఉన్నందున పంత్ రాక ఖాయమని అభిమానులు సైతం భావించారు.
కానీ సెలక్టర్లు ఊహించని రీతిలో వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయని ధ్రువ్ జురెల్‌కు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను ఇక పట్టించుకునే ప్రసక్తే లేదని సెలక్టర్లు చెప్పకనే చెప్పారని పేర్కొన్నాడు.
నిన్ను మేము పట్టించుకోవడం లేదు
ఈ మేరకు.. ‘‘బ్యాకప్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేరు కాబట్టి వన్డే జట్టులో రిషభ్ పంత్‌కు చోటు దక్కాల్సింది. కానీ సెలక్టర్లు ధ్రువ్ జురెల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. పంత్‌ను వెనక్కి నెట్టి జురెల్ ముందుకు వచ్చేశాడు.
తద్వారా.. ‘నిన్ను మేము పట్టించుకోవడం లేదు’ అని సెలక్టర్లు పంత్‌కు నేరుగానే చెప్పినట్లు అనిపించింది. గత రెండు సిరీస్‌లలో కూడా అతడికి అవకాశం ఇవ్వలేదు. దీనిని బట్టి సెలక్టర్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఫామ్ గురించే సమస్య అనుకోవడానికి వీలులేదు.
పంత్ స్థానం గల్లంతే!
ఎందుకంటే పంత్ ఇటీవల శ్రీలంక పర్యటనలో మంచి స్కోర్లే సాధించాడు. ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, చాన్నాళ్లుగా టెస్టు జట్టులో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా వచ్ఛేశాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పంత్ స్థానాన్ని జురెల్ మెల్లగా పూర్తిస్తాయిలో లాగేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదని అభిప్రాయపడ్డాడు.
ఆ జట్టు కెప్టెన్‌గా
కాగా వెస్టిండీస్‌తో వన్డేల నుంచి పంత్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. రెడ్‌బాల్ టోర్నీ ఇరానీ కప్-2026లో భాగంగా రెస్టాఫ్ ఇండియా జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించింది. ఇదిలా ఉంటే.. పంత్ చివరగా 2024లో శ్రీలంక పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు. నాటి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు.
చదవండి: విండీస్‌తో సిరీస్.. భారత జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు


