PC: bcci
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌కు బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉప్యాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పది కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
బీసీసీఐ ఏజీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
1. బీసీసీఐ జనరల్ బాడీలో భాగమైన అరుణ్ సింగ్ ధుమాల్ మరోసారి ఐపీఎల్ చైర్మన్‌గా ఖరారు కాగా.. ఖైరుల్ జమాల్ మజుందార్ సభ్యుడిగా చేరారు.
2. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.
3. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ చేయబడిన ఖాతాల నివేదికను జనరల్ బాడీ ఆమోదించింది.
4. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లను నియమించారు.
5. అదేవిధంగా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
6. బీసీసీఐ శత వసంత ఉత్సవాలు 2028లో ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. డిసెంబరు 2027 నుంచి 2028 వరకు దాదాపు ఏడాది పాటు వేడుకలు చేయాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాన్ని వీలైనంత ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.
7.దేశవాళీ క్రికెట్‌లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్‌లుగా విభజించేందుకు చర్యలు చేపట్టింది.
8.లైంగిక వేధింపుల నిరోధక విధానంలో భాగంగా బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.
9.ఆటగాళ్ల వయసు నిర్దారణకు సంబంధించిన విధానంలో అప్‌డేట్ తీసుకువచ్చింది.
10. దివ్యాంగ క్రికెటర్లకు మద్దతుగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, వారికి కల్పించాల్సిన వనరులు, సౌకర్యాల గురించి రాష్ట్ర అసోసియేషన్లతో చర్చించింది. దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది.


