PC: X
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.
గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్‌కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది.
‘ట్రోఫీ దొంగ’ అంటూ
అతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.
ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
పాత కథ పునరావృతం కాకుండా..
తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.
దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్‌కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.
అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు
‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది
‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్‌గా నిలిచిన హర్మన్‌సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్‌సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.
ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
Humiliation for Mohsin Naqvi 🔥😂
“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026


