వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? | BCCI Informed Naqvi In Advance: Asia Cup Trophy BTS Drama Revealed | Sakshi
Sakshi News home page

వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?

Sep 14 2026 9:51 AM | Updated on Sep 14 2026 10:06 AM

BCCI Informed Naqvi In Advance: Asia Cup Trophy BTS Drama Revealed

ట్రోఫీ లేకుండానే మహిళా జట్టు సంబరాలు (PC: BCCI Women X)

ఆసియా కప్‌ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్‌ నక్వీ వైఖరి కారణంగా భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది.

ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణ
కాగా గతేడాది పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లగా.. సూర్యకుమార్‌ సేన రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.

ఇప్పటికీ ట్రోఫీ భారత్‌ చేతికి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలోనూ భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. దుబాయ్‌ వేదికగా ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్‌ గెలిచింది. అయితే, ట్రోఫీ అందించే విషయంలో నక్వీ మొండిపట్టుదల కారణంగా హర్మన్‌సేన విషయంలో పాత కథే పునరావృతమైంది.

ముందుగానే సమాచారం
నిజానికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీ బహూకరణ అంశం గురించి ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ..

‘‘పురుషుల ఆసియా కప్‌ మాదిరే ఈసారి కూడా ట్రోఫీ అందుకునే విషయంలో మా వైఖరి గురించి ముందుగానే స్పష్టంగా చెప్పాము. ఇప్పటికీ గతేడాది ట్రోఫీ ఇంకా మా చేతికి రాలేదు. అయినా సరే కొంతమంది విదేశీ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఈసారి కూడా సుముఖంగా లేమని చెప్పేశాము.

ఆయన చేతుల మీదుగా అయితే ఓకే
ఒకవేళ ఏసీసీ డిప్యూటీ చైర్‌పర్సన్‌ ట్రోఫీని ఖలీద్‌ అల్‌ జరూనీ ప్రదానం చేస్తే తీసుకుంటామని చెప్పాము. కానీ మా అ‍భ్యర్థనను తిరస్కరించారు. కాబట్టి ట్రోఫీని ఆ వ్యక్తి (నక్వీ) చేతుల మీదుగా తీసుకోవద్దమని మేము నిర్ణయించుకున్నాము’’ అని సైకియా తెలిపాడు.

‘‘ఏదేమైనా ట్రోఫీ చేతికి రానంత మాత్రాన మా జట్టు సాధించిన విజయం వృథాగా పోదు. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన అమ్మాయిలకు అభినందనలు. ఏదో ఒకరోజు రెండు ట్రోఫీలు మన చేతికి వస్తాయి’’ అని సైకియా పేర్కొన్నాడు.

వద్దన్నా వినడు.. ఇదేం బుద్ధి?
బీసీసీఐ ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ మోసిన్‌ నక్వీ ట్రోఫీ తానే ఇస్తానని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పాక్‌ మీడియా జియో న్యూస్‌ వెల్లడించింది. ఏదేమైనా ట్రోఫీ చాంపియన్‌ చేతికి అందుతుందని.. ఈ విషయంలో ఏసీసీ సుముఖంగానే ఉందని పేర్కొంది.

కాగా నక్వీ తీరుపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ముందుగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి?.. ఇదేం బుద్ధి?.. కావాలనే భారత్‌కు ట్రోఫీలు రాకుండా అల్ప సంతోషం పొందడం పాక్‌ మంత్రికి అలవాటై పోయింది’’ అని సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement