ఎనిమిదో టైటిల్‌పై గురి
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్‌లో ప్రసారం
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్‌లు నెగ్గి సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్‌పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్‌లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. స్పిన్‌కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్‌పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది.
బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్‌లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది.


