PC: bcci
మహిళల ఆసియా కప్-2026లో భారత యువ స్పిన్నర్ శ్రీచరణి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ శ్రీచరణి సత్తాచాటింది. ఈ ఆంధ్ర క్రికెటర్ తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది.
నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఈ కడప అమ్మాయి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో పాటు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
కుల్దీప్ రికార్డ్ బ్రేక్
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఆమె కేవలం 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. అంతకుముందు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (30 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును చరణి బ్రేక్ చేసింది. భారత మహిళల విభాగంలో రాధా యాదవ్ (36 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.
ఓవరాల్‌గా మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన మెంగ్టింగ్ ల్యూ (28 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ లీ కాస్పెరెక్, వెస్టిండీస్ క్రికెటర్ అనీసా మహమ్మద్‌లతో కలిసి చరణి (29 మ్యాచ్‌లు) రెండో స్థానాన్ని పంచుకుంది.
ఈ ఆసియాకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో చరణి 8 వికెట్లతో మూడో స్దానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 40 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: IND vs AFG: మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా!


