PC: X
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. శ్రీలంక పర్యటన అనంతరం బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్లు ఇండియా టూడే తమ కథనంలో పేర్కొంది.
ఈ క్రమంలోనే కమలేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అతడు ప్రస్తుతం 3 నెలల నోటీస్ పీరియడ్‌లో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడలతో పాటు విండీస్ సిరీస్‌లో కూడా అతడే ఫిజియోథెరపిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. కాగా తమిళనాడుకు చెందిన కమలేష్ జైన్ గతంలో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో నితిన్ పటేల్ స్థానంలో భారత సపోర్ట్ స్టాప్‌లోకి వచ్చాడు.
అయితే గత కొన్ని నెలలుగా భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో కమలేష్ పనితీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే అతడిపై వేటు పడింది. ఇప్పటికే భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే కూడా తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ పర్యటన నాటికి భారత జట్టుకు కొత్త ఫిజియోథెరపిస్ట్ వచ్చే అవకాశముంది. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: ‘పోరాటం కొనసాగిస్తా’


