భారత్, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెపె్టంబర్ 13, 15, 17న వరుసగా మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఈ సిరీస్ భారత్‌లో జరుగుతున్నప్పటికీ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఆతిథ్యమివ్వనుంది. ‘భారత్–అఫ్గానిస్తాన్ టి20 సిరీస్... సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయనుంది. ‘ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్’లో ఇది రసవత్తర సిరీస్‌గా నిలుస్తుంది’ అని సోనీ పిక్చర్స్ అధికారి రాజేశ్ కౌల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు అఫ్గానిస్తాన్ ప్లేయర్లు స్టార్‌లుగా ఎదగగా... ఇప్పుడు టీమిండియాపై వారు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది కీలకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, తిలక్ వర్మ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా... పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులో ఉండనున్నారు.
మరోవైపు ఇబ్రహీం జద్రాన్ నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్, రహా్మనుల్లా గుర్బాజ్, సాదిఖుల్లా అటల్, అజ్మతుల్లా, గుల్బదీన్ నైబ్, నబీ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఆతృతగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన టీమిండియాతో సిరీస్ ద్వారా తమ ప్రతిభ చాటుకునే అవకాశం అఫ్గాన్ ప్లేయర్లకు లభిస్తుందని ఆయన వెల్లడించారు.
చదవండి: గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు


