టీమిండియా (PC: BCCI X)
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అఫ్గాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడని జాతీయ మీడియా వెల్లడించింది.
కాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియాతో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో
ఇక ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు.
మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన వాషీ!
అయితే, ఫిట్‌నెస్ ఆధారంగానే ఈ నలుగురు అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడతారా? లేదా? అనేది తేలుతుందని బోర్డు పేర్కొంది. ఇండియా టుడే కథనం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ, బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు యాజమాన్యం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీ20 ఫార్మాట్లో అతడు కీలక ప్లేయర్‌గా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ అతడికి ప్రాధాన్యం దక్కుతోంది.
పెరిగిన ప్రాధాన్యం
దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆఫ్ స్పిన్ సేవల కోసం యాజమాన్యం వాషీని వాడుకుంటోంది. వన్డేల్లోనూ సీనియర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కంటే ఈ చెన్నై చిన్నోడికే ప్రాధాన్యం ఇస్తోంది.
అయితే, ఇటీవల యూకే పర్యటనలో వాషీ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే.. గాయం వల్ల 26 ఏళ్ల వాషీ శ్రీలంక పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ వీరుడు, 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు సిరీస్‌కు ఎంపికై అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్‌నెస్ ఆధారంగా), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ఫిట్‌నెస్ ఆధారంగా), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా (ఫిట్‌నెస్ ఆధారంగా), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్‌నెస్ ఆధారంగా).


