కసితీరా బాదిన అభిషేక్‌.. గిల్‌పై ప్రతీకారం! | Abhishek-Sharma-Revenge-On-Gill-Sher-E-Punjab T20 League-Video-Viral | Sakshi
Sakshi News home page

కసితీరా బాదిన అభిషేక్‌.. గిల్‌పై ప్రతీకారం!

Sep 8 2026 12:33 PM | Updated on Sep 8 2026 12:48 PM

Abhishek-Sharma-Revenge-On-Gill-Sher-E-Punjab T20 League-Video-Viral

Photo Credit: Twitter

భార‌త వ‌న్డే కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌, అభిషేక్ శ‌ర్మ టీమిండియా త‌ర‌ఫున ఓపెనింగ్ చేయ‌డంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవ‌డం చూశాం. కానీ ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్ర‌త్య‌ర్థులుగా మారిపోయారు. షేర్‌-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శ‌ర్మ అమృత్‌స‌ర్ సూర్మ‌న్స్‌కు కెప్టెన్‌గా ఉండ‌గా, గిల్ ఫ‌జిల్కా ఫాల్క‌న్స్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

సోమ‌వారం రాత్రి ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా, అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్లో అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌కు రాగా, అప్ప‌టికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్స‌ర్ కొట్టిన గిల్‌, మూడో బంతిని బౌండ‌రీ, ఐదో బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. దీంతో ఓవ‌ర్‌లో వైడ్ స‌హా 16 ప‌రుగులు వ‌చ్చాయి. 

చివ‌రి బంతికి కూడా సిక్స‌ర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాల‌నుకున్నప్ప‌టికీ, సీన్ రివ‌ర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖ‌రి బంతిని భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో గిల్ గాల్లోకి లేప‌గా, బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న న‌మ‌న్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్ర‌తాప్ (40), స‌న్వీర్ సింగ్ (40) రాణించ‌డంతో ఫ‌జిల్కా ఫాల్క‌న్ 20 ఓవర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. 

అనంతరం అమృత్‌సర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో త‌న వంతు రావ‌డంతో అభిషేక్ రెచ్చిపోయాడు. స‌హ‌జ్ ధావ‌న్‌తో క‌లిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బ‌కు అమృత్‌స‌ర్ సూర్మ‌న్స్ 6 ఓవ‌ర్ల‌లో 79 ప‌రుగులు చేసింది. 

అభిషేక్ ఔటైన‌ప్ప‌టికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్‌) అజేయంగా నిలిచి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 ప‌రుగులు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజ‌యంతో అమృత్‌స‌ర్ సూర్మ‌న్స్ త‌మ సెమీస్ ఆశ‌లను సజీవంగా ఉంచుకుంది.

Read: తిలక్‌ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement