Photo Credit: Twitter
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ చెలరేగుతున్నాడు. టీమిండియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో నబీ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లీగ్‌లో భాగంగా మహ్మద్ నబీ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం సెంట్‌కిట్స్ అండ్ నేవిస్ పాట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో మహ్మద్ నబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తొలుత బౌలింగ్‌లో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో పాటు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్గన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (39) కూడా కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ అండ్ నేవీ పాట్రియాట్స్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనజే (52) అర్థసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్, దాసున్ షనక చెరో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అనంతరం గయానా వారియర్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గుర్బాజ్, నబీలతో పాటు షెయ్ హోప్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంట్‌కిట్స్ బౌలర్లలో నవిన్ బిడాయిసె 2 వికెట్లు తీశాడు.
రికార్డు బద్దలయ్యేనా?
ఈ సీజన్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. 2019 సీపీఎల్ సీజన్‌లోనూ గయనా అమెజాన్ వారియర్స్ ఫైనల్లో బార్బడోస్ చేతుల్లో ఓటమికి ముందు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరి తాజా సీజన్‌లో గయానా జట్టు ఆ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు టైటిల్ కొల్లగొడుతుందేమో చూడాలి.
41 year old Mohammed Nabi picked 4/17 in the CPL. 🤯 pic.twitter.com/TXshweqawc
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2026
చదవండి: ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!


