ఆసీస్‌తో సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అతడి రీఎంట్రీ | AUS vs SA: South Africa ODI Squad Named SRH Star Returns After 3 Years | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అతడి రీఎంట్రీ

Sep 7 2026 5:21 PM | Updated on Sep 7 2026 5:29 PM

AUS vs SA: South Africa ODI Squad Named SRH Star Returns After 3 Years

PC: CSA/X

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో తలపడే ఈ జట్టులో పదహారు మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తెంబా బవుమా కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు.

అయితే, సౌతాఫ్రికా పేస్‌ సంచలనం కగిసో రబడ మాత్రం జట్టుకు దూరమయ్యాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. రబడ పూర్తిగా కోలుకోవాలంటే కనీసం 9- 10 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

మరోవైపు.. స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు దూరమయ్యాడు. అయితే, రెండు, మూడో వన్డేలకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గల కారణాన్ని మాత్రం క్రికెట్‌ సౌతాఫ్రికా గోప్యంగా ఉంచింది.

ఇదిలా ఉంటే.. గెరాల్డ్‌ కోయెట్జి దాదాపు మూడేళ్ల తర్వాత ఆసీస్‌ సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌- 2023లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు ప్రొటిస్‌ జట్టు తరఫున చివరి వన్డే ఆడాడు. ఇక కోయెట్జితో పాటు క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించారు.

డికాక్‌, మిల్లర్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా కాంట్రాక్టు ప్లేయర్లు కాదు. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు వీరికి అవకాశం ఇచ్చినట్లుతెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో కోయెట్జి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన  సంగతి తెలిసిందే. కాగా వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహకాల్లో భాగంగా సెప్టెంబరు 24-30 మధ్య ప్రొటిస్‌- ఆసీస్‌ జట్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడతాయి.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు
తెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, కార్బిన్‌ బాష్‌, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్‌ కోయెట్జి, క్వింటన్‌ డికాక్‌, టోనీ డి జోర్జి, బిజోర్న్‌ ఫార్చూన్‌. మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, క్వెనా మఫాకా, ఐడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement