ఆఫ్గన్‌ కెప్టెన్‌ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్‌ క్లీన్‌స్వీప్‌ | Rahmat Shah Century Clinch-ODI Series-For-Afghanistan Vs Ireland | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌ కెప్టెన్‌ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్‌ క్లీన్‌స్వీప్‌

Aug 16 2026 7:18 AM | Updated on Aug 16 2026 7:45 AM

Rahmat Shah Century Clinch-ODI Series-For-Afghanistan Vs Ireland

Photo Credit: Twitter

సొంత‌గ‌డ్డ‌పై ఐర్లాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను అఫ్గానిస్తాన్ (ఒక మ్యాచ్ ర‌ద్దు) 4-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ర‌హ‌మ‌త్ షా అజేయ సెంచ‌రీతో చెల‌రేగి ఆఫ్గన్‌కు మ‌రిచిపోలేని విజ‌యాన్ని అందించాడు. శ‌నివారం జ‌రిగిన ఐదో వ‌న్డేలో అఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగులు చేసింది. హారీ టెక్ట‌ర్ (53) అర్ధ‌సెంచ‌రీతో రాణించ‌గా, లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో క‌ర్టిస్ కాంఫ‌ర్ (96) తృటిలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. చివ‌ర్లో జార్జ్ డాక్రెల్ (31), జోర్డాన్ నీల్ (23 నాటౌట్‌) రాణించారు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా 3 వికెట్లు తీయ‌గా, గ‌జ‌న్‌ఫర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో అఫ్గానిస్తాన్ 48.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 302 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఓపెన‌ర్లు తొంద‌ర‌గానే ఔటైన‌ప్ప‌టికీ వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సేదికుల్లా (98) వ‌రుస‌గా రెండో సెంచ‌రీ అవ‌కాశాన్ని చేజార్చుకోగా, కెప్టెన్ ర‌హ‌మ‌త్ షా (133 బంతుల్లో 143 నాటౌట్‌) ఆఖ‌రి దాకా నిలిచి జ‌ట్టును గెలిపించాడు. అజ్మ‌తుల్లా (24) రాణించాడు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో లియామ్ మెక్‌కార్తి 3 వికెట్లు తీశాడు.

👉వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ ఇదే అత్యధిక పరుగుల ఛేదన కాగా, తొలి మ్యాచ్ రద్దు కారణంగా నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆఫ్గన్ ఐర్లాండ్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక వన్డేల్లో కెప్టెన్‌గా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రహ్మత్ షా నిలిచాడు. గతంలో అస్గర్ అఫ్గాన్‌, షాహిదిలు సెంచరీలు బాదారు. అయితే అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరును రహ్మత్ షా తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు 2026 జూన్ 20న భారత్‌పై మ్యాచ్‌లో షాహిది (102 పరుగులు) పేరిట ఉండేది.

👉ఇక వన్డేల్లో అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రహ్మత్ షా ఆరో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇబ్రహీం జర్దన్ కొనసాగుతున్నాడు. 2025లో లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఇబ్రహీం జర్దన్ 177 పరుగులు చేశాడు. రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా జర్దన్‌దే కావడం విశేషం. ఇక మూడో స్థానంలో రహమనుల్లా గుర్బాజ్ (151 పరుగులు) ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement