Photo Credit: Twitter
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, తన ప్రియురాలికి ఒక యువ బ్యాటర్ ఫోన్‌లో టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినందుకు, సదరు యువ బ్యాటర్‌కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) రూ. 1 లక్ష జరిమానా విధించింది.
‘‘విచారణ కొనసాగుతున్నందున తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆటగాడి పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘జరిమానా విధించిన ఆటగాడు ఎడమచేతి వాటం బ్యాటర్ అని, గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున రెండు అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతూ కనిపించాడు.
ఇది ఎలాంటి అవినీతి ఆరోపణల కిందకు రానప్పటికీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు PMOAలో మొబైల్ ఫోన్ వాడటం నిషేధం. అందువల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే అతడికి లక్ష జరిమానా విధించాం" అని సీనియర్ అధికారి పేర్కొన్నాడు. మొదట యువ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించాలనుకున్నప్పటికీ, నేరం పెద్దది కాకపోవడంతో జరిమానాతో సరిపెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడడం అప్పట్లో సంచలనం కలిగించింది. రోమీ భిందర్ పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా అతడి ఫోన్ చూస్తుండడం వైరల్‌గా మారింది. దీంతో మ్యాచ్ జరుగున్న సమయంలో ఫోన్ చూడడం పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో బీసీసీఐ పీఎంవోఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రోమీ భిందర్‌కు లక్ష జరిమానా విధించిన బీసీసీఐ వైభవ్‌ను మాత్రం హెచ్చరికలతో సరిపెట్టింది.


