Photo Credit: BCCI Twitter
భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వ్యాఖ్య
సరైన దిశలో టీమిండియా
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు.
గతేడాది కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది.
ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే...
అదే ప్రధాన లక్ష్యం...
కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం.
అరుదైన 600వ టెస్టు
దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్‌లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్‌కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్‌కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం.
ప్రసిధ్‌కే మొగ్గు...
ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు.
అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది.
నైపుణ్యానికి కొదవలేదు...
జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్‌మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు.
కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
రిస్క్ తీసుకోలేం...
ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్‌కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్‌లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్‌నెస్ తప్పనిసరి.
టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే.


