Photo Credit : Cricket Australia
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కంగారూలపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా జట్టు తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది.
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ కంగారూలకు చుక్కలు చూపించాడు.
198 పరుగులకే ఆలౌట్
మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితికి చేరుకుంది.
తంజిద్ సెంచరీ
మొత్తంగా 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లా 351 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ సెంచరీ (101)తో కదం తొక్కగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో 84 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 32, హసన్ మహమూద్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.
ముందు బయటకు నడువ్
ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సహనం కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 105 ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో స్టార్క్ వేసిన ఐదో బంతిని మిరాజ్ థర్డ్‌మాన్ దిశగా బాది సింగిల్‌కు వెళ్లాడు.
ఈ క్రమంలో మిరాజ్ పిచ్ (డేంజర్ ఏరియా) మధ్య నుంచి పరుగు తీశాడు. దీంతో స్టార్క్ కోపంతో ఊగిపోతూ.. ‘ముందు వికెట్ మీది నుంచి బయటకు నడువు’ అని హెచ్చరించాడు. ఇందుకు మిరాజ్ గట్టిగానే బదులిచ్చాడు. స్టార్క్ అడ్డుగా ఉండటం వల్లే తాను పిచ్ మధ్యలోకి పరుగు తీయాల్సి వచ్చిందని అంపైర్ కుమార్ ధర్మసేనకు చెప్పాడు.
అంపైర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు
దీంతో స్టార్క్, మిరాజ్‌లను విడదీసిన ధర్మసేన.. మిరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే రెండుసార్లు పిచ్ డేంజర్ జోన్‌లోకి వచ్చావని.. మరోసారి గనుక ఇది పునరావృతమైతే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుందని హెచ్చరించాడు.
"Get off the wicket!"
Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8— cricket.com.au (@cricketcomau) August 14, 2026
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఇప్పటికి రెండు వకిఎట్లు తీశాడు. ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం (20), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (0)లను అవుట్ చేశాడు.
చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు


