Photo Credit: Twitter
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. నజ్ముల్, లిటన్ దాస్‌లను తొలి రెండు క్యాచ్‌లుగా తీసుకున్న స్మిత్ 36 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపపట్టాడు.
స్మిత్‌కు ఇది 218వ క్యాచ్. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో జో రూట్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 165 టెస్టుల్లో 218 క్యాచ్‌లు తీసుకుంటే స్మిత్ మాత్రం 124 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఇక ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్‌లు) రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే (205 క్యాచ్‌లు), సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (200 క్యాచ్‌లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ నుంచి చూసుకుంటే వీవీఎస్ లక్ష్మణ్ (135 క్యాచ్‌లు), కోహ్లి (121 క్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ (115 క్యాచ్‌లు) టెస్టుల్లో వందకు పైగా క్యాచ్‌లు అందుకున్న జాబితాలో చోటు సంపాదించారు.
తంజిద్ శతకం.. పట్టు బిగించిన బంగ్లా
మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మెహదీ హసన్ (32 బ్యాటింగ్), హసన్ మహ్ముద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ (101) మెయిడెన్ శతకంతో మెరవగా, కెప్టెన్ నజ్ముల్ (84) అర్ధశతకంతో ఆకట్టుకోగా, మోమినుల్ హక్ (49) రాణించాడు.

Photo Credit: Twitter
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీయగా, కమిన్స్, నాథన్ లియోన్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. రెండోరోజు ఆటలోనూ బంగ్లాదేశ్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లో రోజు మొత్తంలో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇప్పటికైతే ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ మంచి ఆధిక్యంలో నిలిచి టెస్టులో పట్టు బిగించిందని చెప్పొచ్చు. మ్యాచ్‌లో ఎవరిది పైచేయి కానుందనేది మూడోరోజు ఆటలో తేలిపోనుంది.


