‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్‌ ప్లేయర్‌కు గంభీర్‌ వార్నింగ్‌! | Team India Management Warning-Dhruv-Jurel-Improve-Batting-SL-1st-Test | Sakshi
Sakshi News home page

‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్‌ ప్లేయర్‌కు గంభీర్‌ వార్నింగ్‌!

Aug 14 2026 9:06 AM | Updated on Aug 14 2026 9:53 AM

Team India Management Warning-Dhruv-Jurel-Improve-Batting-SL-1st-Test

Photo Credit: BCCI Twitter

గాలే వేదిక‌గా రేప‌టి నుంచి శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జ‌ట్టు ఇంకా ఖ‌రారు కాలేదు. తుది జ‌ట్టుపై ఒక స్ప‌ష్ట‌త ఉన్న‌ప్ప‌టికీ, ఒక్క స్థానం విష‌యంలో మాత్రం మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేక‌పోతుంది. సాయి సుద‌ర్శ‌న్ గాయ‌ప‌డ‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అనూహ్యంగా జ‌ట్టులోకి వ‌చ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జ‌ట్టులో కొన‌సాగ‌డంపై సందేహాలు నెల‌కొన్నాయి.

జురెల్‌తో పోలిస్తే స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. ఈ నేప‌థ్యంలో ధ్రువ్ జురెల్‌కు మేనేజ్‌మెంట్ నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జ‌ట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సి ఉంటుందని, లేదంటే జ‌ట్టులో చోటు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని కోచ్ గంభీర్ అత‌డికి సున్నితంగానే హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. 

పంత్ రెగ్యుల‌ర్ వికెట్ కీప‌ర్‌గా ఉండ‌డంతో ఇంత‌కాలం జురెల్ అద‌న‌పు బ్యాట‌ర్‌గా జ‌ట్టులో కొన‌సాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాడు. గ‌త ఆరు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచ‌రీ కూడా చేయ‌లేక‌పోయాడు. ఇక 2025లో స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లోనూ ధ్రువ్ జురెల్ విఫ‌ల‌మ‌య్యాడు. 

దీంతో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను గ‌ణ‌నీయంగా పెంచుకోవాల్సిన అవ‌స‌రముంద‌ని యాజ‌మాన్యం భావిస్తోంది. ఆఫ్గ‌న్‌తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే లంక‌-ఏ జ‌ట్టుపై సెంచ‌రీ, హాఫ్ సెంచరీ సాధించి ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు అనిపించాడు. 

కానీ ఇటీవ‌లే లంక ఎలెవెన్‌తో వార్మ‌ప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో జురెల్‌ వ‌రుసగా 1, 17 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇప్ప‌టికే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ జ‌ట్టులోకి రావ‌డంతో జురెల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రిని ఆడించాల‌నే దానిపై మేనేజ్‌మెంట్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించ‌క‌పోవ‌డం అత‌డికి మైన‌స్‌గా మారే అవ‌కాశ‌ముంది. 

అంతేకాదు జురెల్‌తో పోలిస్తే స‌ర్ఫ‌రాజ్ నాలుగు టెస్టులు త‌క్కువే ఆడిన‌ప్ప‌టికీ, ఒక సెంచ‌రీతో పాటు రెండు అర్ధ‌సెంచ‌రీలు ఎక్కువ‌గా సాధించ‌డం విశేషం. దీంతో లంక‌తో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు అధిక ప్రాధాన్య‌మిచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement