Photo Credit: Twitter
యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్న ఆటగాళ్లు మహా అయితే ఏం చేస్తారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి హాయిగా విశ్రాంతి తీసుకోవడం చూస్తుంటాం. కానీ సౌతాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం 47 ఏళ్ల వయసులోనూ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.
ప్రస్తుతం ఇమ్రాన్ తాహిర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో గయానా అమెజాన్ వారియర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వయసు పెరిగినా తన స్పిన్‌లో పదును తగ్గలేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. జమైకా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఇమ్రాన్ తాహిర్ రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడం విశేషం.
అంతేకాదు వయసుకు ఫిట్‌నెస్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ రీజా హెండ్రిక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు వంగి అందుకోవడం ద్వారా అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్ తాహిర్ 2011లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 20 టెస్టుల్లో 57 వికెట్లు, 107 వన్డేల్లో 173 వికెట్లు, 38 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే జమైకా కింగ్స్‌మెన్‌పై గయానా అమెజాన్ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా కింగ్స్‌మెన్ 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (40) టాప్ స్కోరర్. గయానా బౌలర్లలో మొహమ్మద్ నబీ 4 వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహిర్, షమర్ జోసెఫ్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం గయానా వారియర్స్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెయ్ హోప్ (56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ (28), నబీ (19) రాణించారు.
47-YEAR-OLD IMRAN TAHIR IS STILL STRONG 😁🔥
- He is dominating CPL as Captain & Bowler. pic.twitter.com/DsFm7dCLqA— Johns. (@CricCrazyJohns) August 14, 2026
Read: ‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్‌కు గంభీర్ వార్నింగ్!


