ఇదేం బ్యాటింగ్‌.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్‌ ఫైర్‌ | "Can't Excuse": Ricky Ponting Slams Australia's Batting Collapse in 1st Test vs Bangladesh | Sakshi
Sakshi News home page

ఇదేం బ్యాటింగ్‌.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై రిక్కీ పాంటింగ్‌ ఫైర్‌

Aug 14 2026 5:20 PM | Updated on Aug 14 2026 5:37 PM

Cant Excuse: Ricky Ponting Slams Australia Batting In 1st Test Vs BAN

PC: Cricket Australia/Instagram

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్‌తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. 

కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్‌లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

బంగ్లాదేశ్‌ పేస్‌ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్‌ స్మిత్‌ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. 

బంగ్లా పేసర్‌ హసన్‌ మహమూద్‌ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్‌ హుసేన్, తస్కీన్‌ అహ్మద్‌ చెరో 2 వికెట్లు తీశారు.

ఇదేం బ్యాటింగ్‌?
ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్‌లో పిచ్‌ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్‌ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటర్లు టెక్నికల్‌గా ఎన్నో తప్పులు చేశారు.

ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్‌ బౌలింగ్‌ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్‌ విమర్శించాడు.

ముసలోళ్ల జట్టు
అదే విధంగా.. ఆసీస్‌ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్‌ గ్రీన్‌ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. 

జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్‌ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.

తేలిపోయిన బ్యాటర్లు
కాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తర్వాత ఆసీస్‌ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. 

తొలి సెషన్‌లోనే వెదరాల్డ్‌ (23), హెడ్‌ (22), లబుషేన్‌ (1), గ్రీన్‌ (13) వెనుదిరిగారు. లంచ్‌ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్‌స్టర్‌ (12), కమిన్స్‌ (9), స్టార్క్‌ (1) అవుటయ్యారు. మరో ఎండ్‌లో 76 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కొద్ది సేపటికే లయన్‌ (7) అవుట్‌తో ఇన్నింగ్స్‌ ముగిసింది.  బంగ్లాదేశ్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.

ఆధిక్యంలో బంగ్లాదేశ్‌
ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్‌ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

చదవండి: ముందు బయటకు నడువ్‌: స్టార్క్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement