స్కాట్లాండ్ యంగ్ ఆఫ్‌స్పిన్నర్ లైల్ రాబర్ట్‌సన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా డండీ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రాబర్ట్‌సన్.. అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏకపక్ష పోరులో రాబర్ట్‌సన్ బంతితో మ్యాజిక్ చేశాడు.
తన 10 ఓవర్ల కోటాలో 52 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన చేసిన స్పిన్నర్‌గా రాబర్ట్‌సన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ (5/32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అరాఫత్‌ను 23 ఏళ్ల రాబర్ట్‌సన్ అధిగమించాడు.
ఓవరాల్‌గా వన్డే డెబ్యూలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా కగిసో రబాడ వంటి దిగ్గజాలు సరసన ఈ స్కాటిష్ స్పిన్నర్ నిలిచాడు. ఈ జాబితాలో తన సహచర ఆటగాడు చార్లీ క్యాసెల్ ఉన్నాడు. 2024లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాసెల్ 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రాబర్ట్‌సన్ మరో వికెట్ పడగొట్టి ఉండింటే క్యాసెల్ రికార్డును సమం చేసేవాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాను రాబర్ట్‌సన్ దెబ్బతీశాడు. అతడి స్పిన్ ధాటికి కెనడా 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కాట్లాండ్ 170 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాటిష్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!


