Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్‌లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్‌కు విక్టరీని అందించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్‌టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది.

సూపర్‌జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.
ఫైనల్లో సన్‌రైజర్స్ వుమెన్ టీం
మరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్‌లో మాత్రం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్‌ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.
Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026


