విజయంపై బంగ్లాదేశ్‌ గురి  | Australia trailed the visitors by 67 runs in their second innings | Sakshi
Sakshi News home page

విజయంపై బంగ్లాదేశ్‌ గురి 

Aug 16 2026 5:47 AM | Updated on Aug 16 2026 5:47 AM

Australia trailed the visitors by 67 runs in their second innings

రెండో ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా 161/4

డార్విన్‌: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయానికి బంగ్లాదేశ్‌ చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 228 పరుగుల ఆధిక్యం దక్కగా... ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (43 బ్యాటింగ్‌), అలెక్స్‌ కేరీ (19 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా...కంగారూ టీమ్‌ మరో 67 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యర్థిని త్వరగా కుప్పకూల్చి సాధ్యమైనంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించాలని బంగ్లా పట్టుదలగా ఉంది.

 అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 351/6తో మ్యాచ్‌ మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్‌ మిరాజ్‌ (65) కీలక అర్ధసెంచరీ సాధించాడు. శనివారం 28 ఓవర్లు ఆడిన బంగ్లా బ్యాటర్లు చివరి 4 వికెట్లకు మరో 75 పరుగులు జోడించారు. జోష్‌ హాజల్‌వుడ్‌ (6/89) ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. అతను ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 14 సారి కాగా... టెస్టుల్లో 300 వికెట్ల ఘనతను కూడా పూర్తి చేసుకున్నాడు.

 ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆరంభంలో వెదరాల్డ్‌ (0), ట్రవిస్‌ హెడ్‌ (17) వికెట్లు కోల్పోయింది. కొద్దిగా పోరాడిన లబుషేన్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (44) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం గ్రీన్, కేరీ కలిసి మరో వికెట్‌ పడకుండా జట్టును ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌ హీరో హసన్‌ మహమూద్‌ మళ్లీ చెలరేగి 2 వికెట్లు తీయగా... టాప్‌ బ్యాటర్‌ స్మిత్‌ను కీలక సమయంలో అవుట్‌ చేసిన మిరాజ్‌ ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు.  

బెయిల్స్‌ను యథాస్థానంలో పెట్టి... 
ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక అనూహ్య దృశ్యం చోటు చేసుకుంది. హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో కట్‌ చేయడానికి ప్రయత్నించి హెడ్‌ బౌల్డయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ దాదాపు ఇదే తరహాలో మహమూద్‌ బౌలింగ్‌లోనే బౌల్డ్‌ అయిన హెడ్‌లో తీవ్ర నిరాశ కనిపించింది. అయితే అతను అవుట్‌ కాగానే క్రీజ్‌లో వీడలేదు. క్షణకాలం ఆగి కింద పడిన బెయిల్స్‌ను తీసి మళ్లీ స్టంప్స్‌పై యథాస్థానంలో పెట్టి హెడ్‌ నిష్క్రమించాడు. క్రికెట్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడలేదని ఆ సమయంలో కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. మరో వైపు 12 పరుగుల వద్ద గ్రీన్‌కు అదృష్టం కలిసొచ్చింది. తస్కీన్‌ బౌలింగ్‌లో అతని బ్యాట్‌కు తగిలిన బంతి లెగ్‌స్టంప్‌ను స్వల్పంగా తాకుతూ బౌండరీ చేరింది. అయితే బెయిల్స్‌ కింద పడకపోవడంతో గ్రీన్‌ బతికిపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement