అక్కడ శ్రేయస్‌ అయ్యర్‌.. ఇక్కడ శుబ్‌మన్‌ గిల్‌! | Indian mens team could play 2 matches in 2 different countries on Oct 3 | Sakshi
Sakshi News home page

అక్కడ శ్రేయస్‌ అయ్యర్‌.. ఇక్కడ శుబ్‌మన్‌ గిల్‌!

Sep 7 2026 4:16 PM | Updated on Sep 7 2026 4:48 PM

Indian mens team could play 2 matches in 2 different countries on Oct 3

శ్రేయస్‌ అయ్యర్‌- శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI)

దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత పురుషుల క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకేరోజు ‘టీమిండియా’ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో టీ20 జట్టు.. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో వన్డే జట్టు ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఒకేరోజు టీమిండియా రెండు మ్యాచ్‌లు
ఇంతకీ ఆరోజు ఎప్పుడంటారా?.. అక్టోబరు 3. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా- విండీస్‌ మధ్య సెప్టెంబరు 27, 30.. అక్టోబరు 3న వన్డే సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

న్యూ చండీగఢ్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య అక్టోబరు 3న మూడో వన్డే జరుగనుంది. మరోవైపు.. జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నీ అక్టోబరు 3న ముగియనుంది. అదే రోజు పురుషుల క్రికెట్‌లో కాంస్య పతక పోరుతో పాటు ఫైనల్‌ జరుగనుంది.

ఇక గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన టీమిండియా.. ఈసారి నేరుగా ఆసియా క్రీడల క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2023లో రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు చైనాలో పసిడి పతకం గెలవగా.. ఈసారి పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో భారత టీ20 జట్టు జపాన్‌కు వెళ్లనుంది.

గతంలోనూ ఇదే తరహాలో
స్థాయిని బట్టి చూస్తే టీమిండియా ఈసారి కూడా ఫైనల్‌ ఆడటం లాంఛనమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భారత్‌లో గిల్‌ కెప్టెన్సీలో వన్డే జట్టు.. అటు జపాన్‌లో టీ20 జట్టు అక్టోబరు 3న మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా 1998, సెప్టెంబరు 12న కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

నాడు కౌలలంపూర్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సచిన్‌ టెండుల్కర్‌, అనిల్‌ కుంబ్లే, అజయ్‌ జడేజా, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో కూడిన భారత జట్టు.. కెనడాను 112 పరుగుల తేడాతో ఓడించింది. అదే రోజు.. మహ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలో టొరంటో వేదికగా సహారా ఫ్రెండ్‌షిప్‌ కప్‌లో భాగంగా టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడింది. 

ఇందులో సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధు, జవగళ్‌ శ్రీనాథ్‌, అజిత్‌ అగార్కర్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. నాటి ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

చదవండి: ఇషాన్‌ కిషన్‌కు గాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement