250 రిటైర్డ్‌ హర్ట్‌.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ | Duleep trophy final: ishan kishan completed 4000 runs in first class cricket | Sakshi
Sakshi News home page

250 రిటైర్డ్‌ హర్ట్‌.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌

Sep 7 2026 3:13 PM | Updated on Sep 7 2026 3:25 PM

Duleep trophy final: ishan kishan completed 4000 runs in first class cricket

సౌత్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్‌ కుషాగ్రా (101), శికర్‌ మోహన్‌ (85), అభిమన్యు ఈశ్వరన్‌ (72), వైస్‌ కెప్టెన్‌ వైభవ్‌ సూర్యవంశీ (44), అనుకూల్‌ రాయ్‌ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఈస్ట్‌ జోన్‌ అతి భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.

రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్‌ ఖురేషి (6 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్‌ రాయ్‌ ఔటయ్యాడు. సౌత్‌ జోన్‌ బౌలర్లలో త్రిపురణ విజయ్‌, చామ మిలింద్‌ తలో 2 వికెట్లు తీయగా.. షేక్‌ రషీద్‌కు ఓ వికెట్‌ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్‌ రనౌటయ్యాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్‌ కిషన్‌ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్‌‌ లాంబా (320), అన్షుమన్‌ గైక్వాడ్‌ (216), చటేశ్వర్‌ పుజారా (256), యశస్వి జైస్వాల్‌ (209) తర్వాత దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా, 65 ఏళ్ల దులీప్‌ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.

డబుల్‌ సెంచరీకి ముందే ఇషాన్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ఇషాన్‌.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.

కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో ఇషాన్‌ 250 పరుగుల తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్‌ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్‌లో నిలబడిన ఇషాన్‌ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్‌ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.

చదవండి: ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement