ఈస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో సౌత్ జోన్ కఠిన సవాలు ముంగిట నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. మొదటి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
టీమిండియా స్టార్లతో కళ
ఈ క్రమంలో సౌత్ జోన్ ఈస్ట్ జోన్‌కు బదులిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్.. సౌత్ జోన్‌కు తిలక్ వర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్‌లో వైభవ్ సూర్యవంశీ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ఉండగా.. సౌత్ జోన్‌లో దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. కెప్టెన్ తిలక్ వర్మ తనను తుదిజట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణమేంటో తనకు అర్థం కావడం లేదన్న అర్థంలో అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
రంజీ వీరుడు
దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ఆడుతున్న కరుణ్ నాయర్.. 2025-26 రంజీ సీజన్లో 13 ఇన్నింగ్స్‌లో కలిపి 699 పరుగులు సాధించాడు. మొత్తంగా ఇప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 26 శతకాల సాయంతో 9374 పరుగులు రాబట్టాడు.
దురదృష్టవశాత్తూ.. తుదిజట్టు నుంచి తీసేశా
అయితే, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో భాగంగా నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్ తుదిజట్టులో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. ఈ విషయం గురించి కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘కరుణ్ దురదృష్టవంతుడు. ఈసారి అతడికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున.. నేను కొడిమెల హిమతేజను తుదిజట్టుకు ఎంచుకున్నా.
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి కదా!.. కరుణ్ నాయర్ ఇప్పటికే దేశీ క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. కానీ ఈసారి దురదృష్టవశాత్తూ అతడికి అవకాశం దక్కడం లేదు’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. సౌత్ జోన్ కోచ్ మాత్రం కరుణ్ నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని పేర్కొన్నాడు.
శతకంతో కదంతొక్కి
ఇలాంటి తరుణంలో సౌత్ జోన్‌ను వీడి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఛత్తీస్‌గడ్‌తో మ్యాచ్ ఆడాడు కరుణ్ నాయర్. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా 183 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 104 పరుగులు సాధించాడు. ఓవైపు ఈస్ట్ జోన్ బ్యాటర్లు సౌత్ జోన్ బౌలింగ్‌ను చితక్కొడుతున్న వేళ కరుణ్ నాయర్ సెంచరీతో ఈ మేరకు కదం తొక్కాడు.
అర్థం కావడమే లేదు
ఈ పరిణామాల నేపథ్యంలో క్రిక్‌ఇన్ఫో జర్నలిస్టు ఒకరు.. ‘‘దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆడే తుదిజట్టు నుంచి తప్పించిన మరుసటి రోజే కరుణ్ నాయర్ ప్రి-సీజన్ రెడ్‌బాల్ పోటీలో అద్భుతమైన శతకం సాధించాడు.
కరుణ్ జట్టుతో ఉండి ఉంటే సౌత్‌జోన్ 708 పరుగుల మైలురాయిని కాస్త సులువుగానే చేరుకునేది. అయినా అతడిని తుదిజట్టు నుంచి ఎందుకు తప్పించారో అస్సలు అర్థం కావడం లేదు’’ అని ట్వీట్ చేశారు.
తిలక్‌ను టార్గెట్ చేసిన కరుణ్!
ఇందుకు స్పందనగా.. ‘‘అర్థం కావడం లేదు అనే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదేమో!’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని కరుణ్ నాయర్ జోడించాడు. ఈ నేపథ్యంలో.. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారంటూ పరోక్షంగా తిలక్ వర్మను టార్గెట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


