సబలెంకా శ్రమించి... | Aryna Sabalenka Survives Linda Noskova Scare To Reach US Open Semi-Finals | Sakshi
Sakshi News home page

సబలెంకా శ్రమించి...

Sep 9 2026 4:37 AM | Updated on Sep 9 2026 4:37 AM

Aryna Sabalenka Survives Linda Noskova Scare To Reach US Open Semi-Finals

సెమీఫైనల్లోకి డిఫెండింగ్‌ చాంపియన్‌ 

క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ నొస్కోవాపై గెలిచిన టాప్‌ సీడ్‌

న్యూయార్క్‌: ‘హ్యాట్రిక్‌’ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ దిశగా బెలారూస్‌ స్టార్‌ సబలెంకా మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఆరో సీడ్‌ లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై అద్భుత విజయం సాధించింది. తద్వారా వరుసగా ఆరో ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన నొస్కోవాతో జరిగిన పోరులో సబలెంకాకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది.

 అయితే కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన అనుభవం ఆమెకు పనికొచి్చంది. వెనుకంజలో ఉన్నా... ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్‌లో నొస్కావా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్‌ టైబ్రేక్‌’ అనివార్యమైంది. ‘సూపర్‌ టైబ్రేక్‌’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్‌ విజేత అవుతారు.

 సూపర్‌ టైబ్రేక్‌ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది.  

అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మాజీ విజేత, నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), రెండో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కోకో గాఫ్‌ 93 నిమిషాల్లో 6–1, 6–4తో ఇవా జోవిచ్‌ (అమెరికా)పై, రిబాకినా 66 నిమిషాల్లో 6–1, 6–4తో 2018, 2022 చాంపియన్, 13వ సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఐదో సీడా మిరా ఆండ్రీవా (రష్యా)తో కోకో గాఫ్‌; కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా)తో రిబాకినా తలపడతారు.

జ్వెరెవ్‌ ముందంజ...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), 28వ సీడ్‌ అలెగ్జాండర్‌ బ్లాక్స్‌ (బెల్జియం), అన్‌సీడెడ్‌ ప్లేయర్లు ఖచనోవ్‌ (రష్యా), బోటిక్‌ వాన్‌ డె జాండ్‌షుల్ప్‌ (నెదర్లాండ్స్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జ్వెరెవ్‌ 6–2, 6–2, 7–6 (7/3)తో లూసియానో దర్దెరి (ఇటలీ)పై, బ్లాక్స్‌ 6–3, 4–6, 7–5, 7–5తో 24వ సీడ్‌ ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా)పై, ఖచనోవ్‌ 3 గంటల 50 నిమిషాల్లో 7–5, 4–6, 6–7 (6/8), 6–1, 6–4తో 14వ సీడ్‌ లెర్నర్‌ టియెన్‌ (అమెరికా)పై, జాండ్‌షుల్ప్‌ 5 గంటల 13 నిమిషాల్లో 3–6, 6–7 (0/7), 7–6 (9/7), 7–6 (7/3), 6–4తో అలెక్స్‌ గియా (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు. గియాతో జరిగిన మ్యాచ్‌లో జాండ్‌షుల్ప్‌ మూడో సెట్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లను కాచుకోవడం విశేషం.  

సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 34 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్‌ సెమీస్‌ చేరింది. గ్రూప్‌ ‘ఎ’లో అగ్రస్థానం దక్కించుకున్న టీమిండియాతో గురు వారం జరిగే సెమీఫైనల్లో ... గ్రూప్‌ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌ ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement