భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. త్వరలో (సెప్టెంబర్ 18 నుంచి) ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీతోనే బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో హాకీ ఇండియా కాషాయం రంగు జెర్సీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య అప్పట్లో వివాదాస్పదమైంది.
భారత మాజీ కెప్టెన్ వీరెన్ రాస్కిన్హా సహా పలువురు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే జెర్సీ రంగు మార్పునకు విజిబులిటి కారణమని హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. నీలం రంగు సింథటిక్ టర్ఫ్‌తో కలిసిపోయే అవకాశం ఉండటంతో ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకున్నట్లు తెలిపింది.
నీలం రంగే ముద్దు
ఆసియా క్రీడల నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం జట్టు జెర్సీపై హాకీ ఇండియా అభిప్రాయాన్ని కోరగా, నీలం రంగును తొలి ఎంపికగా, కాషాయాన్ని రెండో ఎంపికగా సూచించినట్లు హాకీ ఇండియా కోశాధికారి శేఖర్ మనోహరన్ తెలిపారు.


