మూడో రౌండ్‌లోకి సబలెంకా
న్యూయార్క్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే పరిస్థితుల నడుమ... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన బెలారూస్ స్టార్ సబలెంకా తన జోరు ప్రదర్శిస్తోంది. కేవలం 54 నిమిషాల్లోనే రెండో రౌండ్ మ్యాచ్‌ను ముగించిన డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. పొలీనా లాట్‌సెంకో (రష్యా)తో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సబలెంకా 6–1, 6–1తో గెలుపొందింది. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 24 విన్నర్స్ కొట్టడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
ఆరో సీడ్ నొస్కోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నొస్కోవా 6–4, 6–2తో తరారూడి (థాయ్‌లాండ్)పై, స్వితోలినా 6–2, 6–7 (6/8), 6–4తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, స్వియాటెక్ 6–3, 6–2తో పొడొరోస్కా (అర్జెంటీనా)పై, 13వ సీడ్ ఒసాకా 6–2, 5–7, 6–1తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అల్‌కరాజ్ 2 గంటల 40 నిమిషాల్లో 4–6, 6–0, 6–3, 6–2తో జైమీ ఫారియా (పోర్చుగల్)ను ఓడించాడు. ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), 11వ సీడ్ టియాఫో (అమెరికా) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.


