ప్రపంచ 11వ ర్యాంకర్‌పై విజయం
లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నీ
లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్‌లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ జోరు కొనసాగిస్తోంది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) గోల్డ్ ఈవెంట్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్‌ను చిత్తు చేసిన అనాహత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 13–11, 4–11, 11–8తో ఎనిమిదో సీడ్ నెలె గిలిస్ (బెల్జియం)పై గెలుపొందింది.
39 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ జూనియర్ చాంపియన్ అనాహత్ తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకుంది. రెండో గేమ్‌లో బెల్జియం ప్లేయర్ ప్రతిఘటన చూపడంతో పరాజయం పాలైన 18 ఏళ్ల అనాహత్... నిర్ణయాత్మక పోరులో కీలక పాయింట్లు సాధించి ముందంజ వేసింది.
నేడు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణ్యం (మలేసియా)తో అనాహత్ తలపడనుంది. ఇక ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్, భారత ప్లేయర్ రమిత్ టాండన్ 12–10, 11–9 తో ఎనిమిదో సీడ్ మొహమ్మద్ ఎల్షోర్‌బాగీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు.


