Photo Credit: Khel India Twitter
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అనాహత్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)పై విజయాన్ని అందుకుంది. తద్వారా 21 ఏళ్ల తర్వాత ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డులకెక్కింది.
2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న అనాహత్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనుంది.
గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జరిగిన మ్యాచ్‌లో అనాహత్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహత్ గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది.
మ్యాచ్ విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు పరిస్థితులు నాకు కఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదని మొదటి నుంచి గెలుపు కోసమే ప్రయత్నించాను.
అయితే క్వార్టర్స్‌లో నమోదు చేసిన ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ సెమీస్‌లో విజయం నాకు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా నా తల్లిదండ్రులను, కోచ్‌లను హ్యాపీ చేయగలిగాను. కానీ ఫైనల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది.
ANAHAT SINGH STORMS INTO THE FINALS OF JUNIOR WORLD C’SHIP 🏆🤩
India’s Anahat defeated Barb Sameh of Egypt 🇪🇬 3-1 (11-3, 8-11, 11-4, 11-6) in the Semi Final!
She became the second ever Indian to reach into the World Junior C’ship Final ✅
WELL DONE! 🔥 pic.twitter.com/2wEfv2sDAK— The Khel India (@TheKhelIndia) July 25, 2026


