అర్జెంటీనా ఓట‌మి.. మెస్సీ భావోద్వేగ లేఖ‌ | Lionel Messi Emotional Letter-After Argentina Lost FIFA World Cup-Final | Sakshi
Sakshi News home page

అర్జెంటీనా ఓట‌మి.. మెస్సీ భావోద్వేగ లేఖ‌

Jul 21 2026 7:32 AM | Updated on Jul 21 2026 8:48 AM

Lionel Messi Emotional Letter-After Argentina Lost FIFA World Cup-Final

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో స్పెయిన్ చేతిలో ఓట‌మి త‌ర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వ‌రుసగా రెండోసారి ఫిఫా గెల‌వాల‌నుకున్న అత‌డి క‌లలను స్పెయిన్ ఆవిరి చేయ‌డంతో మైదానంలోనే చిన్న పిల్లాడిలా మారిపోయి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది చూసిన అభిమానులు కూడా క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. 

అయితే ఫైన‌ల్ ముగిసిన ఒక‌రోజు త‌ర్వాత మెస్సీ త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా భావోద్వేగ లేఖ‌ను పంచుకున్నాడు. 'ఫ‌లితం చూసిన త‌ర్వాత చాలా బాధేసింది. ఈ గాయం మాన‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఏదైనా అంతా మంచే జ‌ర‌గాల‌నే దానికే నేను క‌ట్టుబ‌డి ఉంటాను.' అని మెస్సీ ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు.

'ప్రతీ మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడామ‌నే అనుకుంటున్నాం. ఈ ఫిఫా టోర్నీలో మా దేశ ప్ర‌జ‌లు ప్ర‌తీ విష‌యంలో మాకు అండ‌గా నిల‌వ‌డంతో వారి మ‌ద్దుతుతోనే క‌ష్ట‌ప‌డ్డాం. ఫైన‌ల్ దాకా చేరుకున్నాం. జ‌ట్టు కృషి, ప్ర‌య‌త్నం క‌ల‌గ‌లిసి అర్జెంటీనాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ జ‌ట్ల‌లో ఒక‌టిగా నిల‌బెట్టింద‌ని బలంగా చెప్ప‌గ‌ల‌ను. ఇవాళ ఓట‌మితో మ‌నం సాధించిన విజ‌యాన్ని చెప్పుకోవ‌డం క‌ష్ట‌మే.

 కానీ వ‌రుస‌గా రెండు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో అర్జెంటీనా ఫైన‌ల్ చేరింద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మాకు అండ‌గా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి (అర్జెంటీనాతో పాటు మిగ‌తా దేశాలు) పేరు పేరునా ధ‌న్య‌వాదాలు చెబుతున్నా. మ‌న‌మంతా ఎప్ప‌టికీ ఇలానే ఐక్యంగా ఉంటూ అర్జెంటీనా ఖ్యాతిని కాపాడుకుందాం. ఇక చాంపియ‌న్‌గా నిలిచిన స్పెయిన్‌కు కూడా నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు' తెలుపుతూ లేఖను ముగించాడు.

2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మ‌రోసారి అన్నీ తానై న‌డిపించాడు. ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్ట‌ర్ ఫైన‌ల్ వ‌ర‌కు) క‌నీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 9 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, 4 అసిస్ట్‌లతో సిల్వర్‌ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో దుర్భేద్యమైన స్పెయిన్‌ ఫార్వార్డ్‌ ప్లేయర్లను అడ్డుకోవడమే సరిపోవడంతో మెస్సీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా  ఫిఫా టైటిల్‌ను గెలిచి ఉంటే, ఆ మ‌రుక్ష‌ణ‌మే మెస్సీ ఆట‌కు వీడ్కోలు ప‌లికేవాడేమో. ప్ర‌స్తుతం త‌న రిటైర్మెంట్‌పై మౌన‌మే వ‌హించిన‌ప్ప‌టికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడ‌డం అనుమానమే. కాబ‌ట్టి ఫుట్‌బాల్‌లో ఒక శ‌కం దాదాపు ముగిసిన‌ట్లే.

 

 

చదవండి: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement